భారత్ బంద్.. రవాణా, బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం
ABN , Publish Date - Feb 11 , 2026 | 09:33 PM
దేశవ్యాప్తంగా ఈనెల 12న సార్వత్రిక సమ్మె జరుగనుంది. సమ్మెకు 10 ప్రధాన కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పలు రైతు సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈనెల 12న సార్వత్రిక సమ్మె (Bharat Bandh) జరుగనుంది. సమ్మెకు 10 ప్రధాన కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పలు రైతు సంస్థలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ పోరాటానికి పిలుపునిచ్చాయి.
ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాల స్థానే 2025 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు వివాదాస్పదంగా మారాయి. ఇవి కార్మికులపై ప్రతికూల ప్రభావం చూపించనున్నాయని, ఇందువల్ల ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని, ఉద్యోగులను తొలగించడం యజమానులకు తేలికవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రైవేటీకరణ, వేతనాల్లో వృద్ధి లేకపోవడం, సామాజిక భద్రత కొరవడటం జరుగుతుందని చెబుతున్నాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం దేశీయ వ్యవసాయరంగాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నాయి.
దేశవ్యాప్త బంద్‌లో సుమారు 30 కోట్ల మంది కార్మికులు భాగస్వాములు కానున్నట్టు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ తెలిపారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంసీ, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కిసాన్ సభ సహా పలు రైతు సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
బంద్ ప్రభావం
భారత్ బంద్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో కార్మిక సంఘాలు పాల్గొనే అవకాశం ఉన్న కేరళ, ఒడిశాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. నిత్యావసరాలు, ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, విద్యుత్, నీటి సరఫరా వంటివి యథాప్రకారం కొనసాగుతాయి. బ్యాంకులకు అధికారికంగా ఆర్బీఐ సెలవు ప్రకటించకపోవడంతో సేవల్లో అంతరాయ కలిగే అవకాశాలున్నాయి. నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లో జాప్యం కలగవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు మామూలుగానే కొనసాగే వీలుంది. స్కూళ్లు, పాఠశాలలకు అధికారికంగా ఎలాంటి సెలవు ప్రకటించినప్పటికీ స్థానిక పరిస్థితులను బట్టి మూతపడే అవకాశాలుంటాయి.
ఇవి కూడా చదవండి..
వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన
ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి