నర్మదా నదిలో వేలాది లీటర్ల పాలు.. ఆందోళనలో పర్యావరణవేత్తలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:54 PM
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా భైరూందా సమీపంలో నర్మదా నది తీరాన నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక ఉత్సవం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 11,000 లీటర్ల పాలను నదిలోకి వదలడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా భైరూందా సమీపంలో నర్మదా నది తీరాన నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక ఉత్సవం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నది స్వచ్ఛతను కాపాడాలని ప్రార్థిస్తూనే, ఏకంగా 11,000 లీటర్ల పాలను నదిలోకి ఒంపడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భైరూందా ప్రాంతంలో గత 21 రోజులుగా భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుక ముగింపు సందర్భంగా నర్మదా నదికి ‘దుగ్ధాభిషేకం’ నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా.. ట్యాంకర్ల ద్వారా భక్తులు జయజయధ్వానాల మధ్య సుమారు 11,000 లీటర్ల పాలను నేరుగా నర్మదా నదిలోకి వదిలేశారు. నది స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ ఈ అభిషేకం చేశామని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నదిని పూజించడం వరకు బాగానే ఉన్నా, పాలను ఈ స్థాయిలో నీటిలో కలపడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు నీటిలో కలిగినప్పుడు అవి కుళ్ళిపోయే క్రమంలో నీటిలోని కరిగిన ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతుంది. ఇది చేపలు, ఇతర జలచరాల మరణానికి కారణమవుతుంది. అంతేకాదు, పాలలో ఉండే సేంద్రియ పదార్థాల వల్ల నీటిలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెంది, నీరు కలుషితం అవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నదులను పవిత్రంగా భావించడం భారతీయ సంస్కృతిలో భాగమే అయినప్పటికీ, ఆ పవిత్రతను కాపాడే క్రమంలో పర్యావరణానికి నష్టం చేకూర్చడం సరికాదని మేధావులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ
బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ