నీట్ పేపర్ లీకేజీలకు చెక్.. ఒకే ప్రశ్నపత్రం విధానాన్ని మార్చాలన్న నందన్ నిలేకని
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:06 PM
నీట్ పేపర్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే పరీక్షా విధానంలోనే మార్పులు రావాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని సూచించారు. ఒకే ప్రశ్నపత్రానికి బదులుగా భారీ ప్రశ్నల బ్యాంకు, చివరి నిమిషంలో ప్రశ్నపత్రం తయారీ వంటి ప్రతిపాదనలు చేశారు.
Nandan Nilekani NEET Paper Leak Suggestions: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) లాంటి ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని (Nandan Nilekani) అభిప్రాయపడ్డారు. పరీక్షా విధానంలో సమూల మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందని, ఒకే ఒక్క ప్రశ్నపత్రంపై ఆధారపడే విధానం వల్లే ఈ లీకేజీ మాఫియా పుట్టుకొస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఒక పరీక్షకు సంబంధించి ముందే ముద్రించి సిద్ధంగా ఉంచే 'ఒక ప్రశ్నపత్రం' విధానం ఎందుకు అవసరమని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నపత్రం ఉందంటేనే దాన్ని లీక్ చేసి అమ్ముకునే ఆర్థిక కుంభకోణానికి ఆస్కారం ఇస్తుందని నిలేకని విశ్లేషించారు.
నందన్ నిలేకని చేసిన ప్రధాన ప్రతిపాదనలు:
1.పెద్ద ఎత్తున ప్రశ్నల బ్యాంకు (Question Bank)
పరీక్షలకు ముందు ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించే బదులు, భారీ సంఖ్యలో ప్రశ్నలతో కూడిన 'క్వశ్చన్ బ్యాంక్'ను సిద్ధం చేయాలి. పరీక్ష ప్రారంభానికి కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఆటోమేటెడ్ విధానంలో ప్రశ్నపత్రాన్ని సృష్టించాలి (Last-minute paper generation). ఇది జరిగితే పేపర్ లీక్ చేయడం ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.
2. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT)
పెన్ అండ్ పేపర్ విధానం నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత డిజిటల్ పరీక్షలకు మారాల్సిన అవసరం ఉందని నిలేకని సూచించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని తెలిపారు.
3. 1.5 లక్షల పరీక్షా కేంద్రాల అవసరం
దేశంలో విద్యార్థులు సులభంగా పరీక్ష రాసేందుకు వీలుగా కనీసం 1.5 లక్షల పరీక్షా కేంద్రాల మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలని చెప్పారు.
పరీక్షా పత్రాలు లీకైన తర్వాత తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడం కంటే, పరీక్షా విధానంలోనే వ్యవస్థాత్మకమైన (Systemic) మార్పులు తేవాలని నందన్ నిలేకని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రధాని కూడా ఈ మార్పుల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
అత్తమామల వేధింపులతో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య.. సుసైడ్ నోట్ కలకలం!
గుజరాత్ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం