పరీక్షా విధానంలో సంస్కరణలకు.. హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:24 AM
పదేపదే ప్రశ్నపత్రాలు లీక్ అవుతుండడంపై విద్యార్థి లోకం గళమెత్తుతుండడంతో.. పరీక్షా విధానంలో సంస్కరణల దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు...
నందన్ నిలేకణి నేతృత్వంలో ఏర్పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
టాస్క్‌ఫోర్స్‌లో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ సహా ఐదుగురు సభ్యులు
దెబ్బతిన్న మోదీ ఇమేజ్‌ను బాగు చేసుకునే హైపవర్డ్ యత్నమిది: కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూలై 26: పదేపదే ప్రశ్నపత్రాలు లీక్ అవుతుండడంపై విద్యార్థి లోకం గళమెత్తుతుండడంతో.. పరీక్షా విధానంలో సంస్కరణల దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, ఆధార్ రూపకర్త నందన్ నిలేకణి నేతృత్వంలో ఈ అంశంపై హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ టాస్క్‌ఫోర్స్ సిఫారసు చేస్తుందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని గుర్తుచేసిన ప్రధాని.. సంస్కరణల ద్వారా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ‘‘విద్యార్థుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకున్నవారు ఇప్పటికే జైళ్లలో మగ్గుతున్నారు. ఇప్పటికే మేం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశాం. సోమవారం పార్లమెంటులో.. అత్యంత కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతున్నాం’’ అని మోదీ తాజా వీడియో సందేశంలో వివరించారు. ప్రభుత్వం తక్షణ చర్యల గురించి మాత్రమే కాకుండా.. దీర్ఘకాలంలో చేపట్టాల్సిన సంస్థాగత సంస్కరణల దిశగా కృషి చేస్తోందని చెప్పారు. ‘‘మనం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. మన పరీక్షా వ్యవస్థ విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలి. టెక్నాలజీని గరిష్ఠంగా వినియోగించుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. అంతర్జాతీయంగా పేరొందిన సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకనీ నేతృత్వంలో పరీక్షావిధానంలో సంస్కరణల నిమిత్తం ఒక హై-పవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం’’ అని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల విశ్వసనీయతను మరింత మెరుగుపరచేందుకు.. ఆ టాస్క్‌ఫోర్స్ చేసే సిఫారసులను వీలైనంత త్వరగా అమలుచేస్తామన్నారు. కాగా.. మోదీ ప్రకటించిన హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది పేపర్‌లీక్ విషయంలో దారుణంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ ఇమేజ్‌ని బాగుచేసుకునేందుకు చేస్తున్న హై-పవర్డ్ ప్రయత్నం అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎద్దేవా చేశారు. 2024 జూన్‌లో సైతం.. నీట్ సహా పలు పరీక్షల నిర్వహణలో విఫలమైన మోదీ సర్కారు డాక్టర్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మళ్లీ 2026 జూలైలో కూడా నీట్ సహా పలు పరీక్షల నిర్వహణలో విఫలమై హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను నియమించిందంటూ మోదీ సర్కారు వైఫల్యాలపై ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. రాధాకృష్ణన్ కమిటీ చేసిన 101 సిఫారసులను మోదీ సర్కారు ఇంకా అమలు కూడా చేయకముందే కొత్త కమిటీ వచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. 2024, 2026 నడుమ మోదీ సర్కారు ఎన్‌టీఏకు ఫుల్‌టైమ్ డైరెక్టర్ జనరల్‌ను కూడా నియమించలేకపోయిందని దుయ్యబట్టారు.
యువతకు సాధికారతే మా లక్ష్యం
దేశంలో యువతీ యువకులంతా ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరతతో సాధికారత సాధించేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘మై భారత్’ ద్వారా చేపట్టిన వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమానికి ఎంపికైన 400 మంది యువతతో ప్రధాన మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం మాట్లాడారు. నేటి యువతలో ఒంటరిగా (సోలో) ప్రయాణించడం ఓ ట్రెండ్‌గా మారుతోందని మోదీ అన్నారు. ఓ వ్యక్తి ప్రపంచంతోపాటు తనని తాను తెలుసుకునేందుకు సోలో ట్రావెలింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన మీరంతా ఓ కుటుంబం అయ్యారని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న యువతను ఉద్దేశించి అన్నారు. కాగా, భారతదేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను దేశ తొలి గ్రామాలనే భావన తీసుకురావడం, అక్కడి ప్రజలను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన పోటీ ద్వారా దేశ నలమూలలుకు చెందిన 400 మంది యువతను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. వీరంతా జూన్ 4 నుంచి జూన్ 30 వరకు వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ఎంపిక చేసిన 74 గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్‌లో ఎవరున్నారంటే..
నందన్ నిలేకణి: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, ఆ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్
ఎస్.సోమనాథ్: ఇస్రో మాజీ చైర్మన్
తపన్ డేకా: ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్
వి.కామకోటి: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
అనితా కర్వాల్: కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి
అమృత్‌లాల్ మీనా: లాజిస్టిక్స్ నిపుణుడు, 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి (బిహార్ క్యాడర్).
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు