Share News

నమో భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రిప్ పాస్‌తో 10 శాతం వరకు డిస్కౌంట్..

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:04 PM

నమో భారత్ రైళ్ల ప్రయాణికులకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రోజువారీ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రిప్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

నమో భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రిప్ పాస్‌తో 10 శాతం వరకు డిస్కౌంట్..
Namo Bharat Trip Pass

న్యూఢిల్లీ: నమో భారత్ రైళ్ల ప్రయాణికులకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) గుడ్ న్యూస్ చెప్పింది. రోజువారీ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ట్రిప్ పాస్’ (Trip Pass) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రతి ట్రిప్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు రోజూ టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.


ఇంతకీ ట్రిప్ పాస్ అంటే ఏమిటి?

ట్రిప్ పాస్‌ను ఒక రకమైన బల్క్ ట్రావెల్ పాస్‌గా చెప్పుకోవచ్చు. బస్సులు, లోకల్ రైళ్లలో ఉండే నెలవారీ పాస్ తరహాలోనే ఇది పనిచేస్తుంది. దీని ద్వారా ప్రయాణికులు తాము తరచూ ప్రయాణించే రెండు నిర్ణీత స్టేషన్ల మధ్య ముందుగానే ట్రిప్పులను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఆఫీసులు, పాఠశాలలు, కాలేజీలకు నమో భారత్ రైళ్లలో వెళ్లే వారికి ఈ పాస్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఒకసారి తీసుకుంటే ఎలా ఉపయోగించాలి?

ట్రిప్ పాస్ ఒక నిర్దిష్ట రూట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు బేగంపుల్ నుంచి సరాయ్ కాలే ఖాన్ వరకు ట్రిప్ పాస్ తీసుకున్నట్లయితే, ఆ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికే అది చెల్లుతుంది. ఆ రెండు స్టేషన్లకు ముందు లేదా తర్వాతి స్టేషన్‌లో దిగితే ట్రిప్ పాస్ వర్తించదు. అలాగే వేరే స్టేషన్‌కు ప్రయాణిస్తే, సాధారణ ఛార్జీ NCMC గ్లోబల్ వాలెట్ నుంచి కట్ అవుతుంది.


ఎక్కడ తీసుకోవచ్చు..?

నమో భారత్ స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల సమీపంలోని కౌంటర్లలో ట్రిప్ పాస్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా ట్రిప్పులను టాప్-అప్ చేసుకోవాలంటే ఎలక్ట్రానిక్ ఫేర్ ఆఫీస్ (EFO), టికెట్ వెండింగ్ మెషీన్లు (TVMs) ద్వారా కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ప్రయాణికులకు డబ్బు ఆదా..!

ఈ ట్రిప్ పాస్‌తో సమయం మాత్రమే కాకుండా డబ్బూ ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులకు ప్రతి ట్రిప్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా NCMC కార్డు వినియోగదారుల కోసం లాయల్టీ ప్రోగ్రామ్ కూడా ఉంది. నమో భారత్ రైళ్లలో ఖర్చు చేసే ప్రతి రూ.1కి ఒక లాయల్టీ పాయింట్ లభిస్తుంది. ఒక్కో లాయల్టీ పాయింట్ విలువ రూ.0.10గా ఉంటుంది. మొత్తం 300 లాయల్టీ పాయింట్లను ఒక ఉచిత ప్రయాణానికి రీడీమ్ చేసుకోవచ్చు.

ఎన్ని ట్రిప్పులు కొనుగోలు చేయొచ్చు..?

ట్రిప్ పాస్ స్టాండర్డ్, ప్రీమియమ్ కోచ్‌లకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల అవసరాన్ని బట్టి 1, 2 వారాలకు సరిపడేలా లేదా 1 నుంచి 40 ట్రిప్పుల వరకు ఎంపిక చేసుకోవచ్చు. 10 ట్రిప్పుల పాస్ తీసుకుంటే రీఫండ్‌కు అవకాశం ఉండదు. 15, 20, 40 ట్రిప్పుల పాస్ తీసుకుంటే రీఫండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే రీఫండ్ సమయంలో రూ.200 అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీ మినహాయిస్తారు.

రోజువారీ ప్రయాణికులకు మరింత సౌకర్యం

ఈ ట్రిప్ పాస్ ప్రతిరోజూ రైల్లో వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రోజూ క్యూఆర్ టికెట్ కొనడం, క్యూలో నిలబడటం లేదా పదేపదే వాలెట్ రీచార్జ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. మొత్తానికి, నమో భారత్‌లో రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి ట్రిప్ పాస్ సదుపాయం ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు సమయం, ప్రయాణ ఖర్చును ఆదా చేసే అవకాశం కల్పిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నా.. మోదీతో కెప్టెన్ స్మిత్..

2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు: SP, కాంగ్రెస్ మధ్య సీట్ల బేరాలు

Updated Date - Oct 02 , 2026 | 05:14 PM