భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి, 15 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది
ABN , Publish Date - Oct 14 , 2026 | 08:26 AM
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నలసోపారాలోని ఇంపీరియల్ హైట్స్ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఒకరు మృతిచెందినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర: పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నలసోపారాలోని ఇంపీరియల్ హైట్స్ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఒకరు మృతిచెందినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటలకు భవనంలోని 8వ అంతస్తు నుంచి 10వ అంతస్తు వరకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మంటలు వ్యాపించగానే పలువురు భవనం నుంచి బయటకు పరుగులు తీయగా.. అగ్నిమాపక సిబ్బంది మరో 15 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే, ఈ ప్రమాదంలో 60 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పుణె శివాలయంలో బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్..
బెంగళూరులో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు కేరళం వాసుల అరెస్ట్!