దారుణం.. పోలీసును విచక్షణారహితంగా కొట్టిన యువకులు..
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:56 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనాలపై వెంబడించి ఓ పోలీసు అధికారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మహారాష్ట్ర: నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ద్విచక్ర వాహనాలపై వెంబడించిన కొందరు యువకులు నడిరోడ్డుపై ఓ పోలీసును విచక్షణారహితంగా కొట్టారు. ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు కురిపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీసును స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుపై దాడి జరగడం నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ పోలీస్ అధికారి (35) తన వ్యక్తిగత కారులో మహిళా స్నేహితురాలితో కలిసి మన్‌కాపూర్ చౌక్ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వారి కారు, నిందితుల ద్విచక్రవాహనం స్వల్పంగా ఢీకొనడంతో వివాదం చెలరేగింది. అధికారి కారును అడ్డగించిన యువకులు అనంతరం ఆయనతో వాగ్వాదానికి దిగారు. కారును ధ్వంసం చేయడంతో పాటు పోలీసును కారులోంచి బయటకు లాగారు. విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డు అవతలి వైపునకు ఈడ్చుకెళ్లారు. ఆపై తీవ్రంగా గాయపడేలా దాడి చేశారు. రోడ్డుపై పదులకొద్దీ వాహనాలు వెళ్లినా.. యువకులను నిలువరించేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. దాడి అనంతరం యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు కొంతమంది కలుగజేసుకుని బాధితుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులను హర్ష్ పవార్, గౌరవ్ ధిర్డే, సంయమ్ గణేశ్‌పురి, యాస్ ప్రతేకి, సత్యం షిర్కే, ప్రేమ్‌రాజ్ ధాకటే, ఆకాశ్ బోకాడే, నితిన్ గోఖలే, విక్కీ తెల్ఘారే, భూమి దేవ్ అలియాస్ సాగర్ బోక్డే, గణేశ్ ఉయికే, ప్రీతమ్ మోడేకర్, టికారామ్ బరాపాత్రేగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో కొందరిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు వారి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
ఈ వార్తలు కూడా చదవండి
కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ పాత వీడియో వైరల్..
అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు