అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు
ABN , Publish Date - Jul 03 , 2026 | 10:30 AM
జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఢిల్లీ, జూలై 3: జమ్మూ- కశ్మీర్‌లో నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర యాత్రను ఒక 'గొప్ప భాగ్యం'గా అభివర్ణించిన ప్రధాని, భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన జాతీయ భావనతో భక్తులు ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరారు. శివభక్తులను ఉద్దేశించి రాసిన లేఖను ఎక్స్ (X) వేదికగా పంచుకుంటూ పీఎం మోదీ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
'పవిత్రమైన అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప భాగ్యం. ప్రతి సంవత్సరం 'బాబా బర్ఫానీ' (మంచు లింగం)ని నేరుగా దర్శించుకునే ఈ అవకాశం లక్షలాది మంది శివభక్తులకు అత్యంత పవిత్రమైన, మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఈ సంవత్సరం యాత్రకు సిద్ధమవుతున్న భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం
ఈ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక శాశ్వతమైన అధ్యాయమని ప్రధాని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన సంస్కృతిని అనుసరించే లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా బాబా అమర్‌నాథ్ ఆశీస్సుల కోసం జమ్మూ కశ్మీర్‌కు వస్తుంటారని గుర్తుచేశారు. వివిధ ప్రాంతాలు, విభిన్న భాషలు, భిన్నమైన ఆచారాలు ఉన్నప్పటికీ.. మహాదేవుని ఆశీస్సులు పొందాలనే ఒకే ఒక సంకల్పంతో భక్తులంతా ఇక్కడికి తరలివస్తారని, ఈ రెండు నెలల కాలంలో బాబా బర్ఫానీ పవిత్ర సన్నిధిలో భారతదేశ 'భిన్నత్వంలో ఏకత్వం' అనే అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని మోదీ అన్నారు.
ఈ యాత్ర సజావుగా సాగడానికి అహర్నిశలు శ్రమిస్తున్న భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు, పరిపాలనా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
యాత్రికులకు పీఎం మోదీ సూచించిన 'ఐదు సంకల్పాలు'
ఈ ఏడాది యాత్ర సందర్భంగా భక్తులందరూ తమ జీవితంలో ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
1. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఎక్కడా చెత్తాచెదారం వేయకుండా, పరిశుభ్రత నియమాలను తూచా తప్పకుండా పాటించాలి.
2. పరిపాలన నిబంధనలు: వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో జారే మార్గాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, పరిపాలనా యంత్రాంగం ఇచ్చే ఆదేశాలను, ట్రాఫిక్ నిబంధనలను, భద్రతా సూచనలను పూర్తిగా అంకితభావంతో పాటించాలి.
3. లోకల్ వస్తువుల కొనుగోలు (Vocal for Local): స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, యాత్రికులు తమ ప్రయాణ ఖర్చులలో కనీసం 10 శాతం మొత్తాన్ని జమ్మూ కశ్మీర్‌లోని స్థానిక ఉత్పత్తులను కొనుగోలుకు కేటాయించాలి. ఇది అక్కడి కుటుంబాలకు, యువతకు ఉపాధినిస్తుంది.
4. మొక్కలు నాటడం (ఏక్ పేడ్ మా కే నామ్): రక్షాబంధన్ పండుగతో ముగిసే ఈ యాత్ర ముగింపు సందర్భంగా.. 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరిట ఒక మొక్క) ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి.
5. వికసిత్ భారత్: దేశమే ప్రథమమనే ('Nation First') భావనతో, మన బాధ్యతలను ఏడాది పొడవునా నిజాయితీగా నిర్వర్తిస్తూ, 'వికసిత్ భారత్' నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలి. చివరగా, భక్తులందరి ప్రయాణం సుఖమయంగా, సురక్షితంగా, ఆధ్యాత్మికంగా సాగాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి తన సందేశాన్ని ముగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్‌ల నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్ అమర్‌నాథ్ యాత్రికులు
విజయ్ ప్రభుత్వం కూల్చివేత కుట్ర కేసులో మరో నలుగురి అరెస్టు
ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు