Share News

నాలుగు నెలలుగా సెలవు ఇవ్వకుండా వేధించారు.. ఆత్మహత్య లేఖలో ఉద్యోగిని ఆవేదన..

ABN , Publish Date - Aug 08 , 2026 | 08:31 PM

పని ప్రదేశంలో వేధింపుల కారణంగా ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు తనను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది.

నాలుగు నెలలుగా సెలవు ఇవ్వకుండా వేధించారు.. ఆత్మహత్య లేఖలో ఉద్యోగిని ఆవేదన..
Mysuru Workplace Harassment

బెంగళూరు: పని ప్రదేశంలో వేధింపుల కారణంగా ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు తనను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది. నాలుగు నెలలుగా సెలవు ఇవ్వకుండా పని చేయించారని ఉద్యోగిని రాసిన సూసైడ్ నోట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరగగా.. ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ చర్చనీయాంశమైంది.


నాగేశ్వరి అనే యువతి మైసూరులోని ఓ మార్టులో విధులు నిర్వహించేది. ఆమె పీపీఎంఎస్ ఏజెన్సీ అనే మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఉద్యోగంలో చేరింది. అయితే, కొన్ని నెలలుగా తనను లక్ష్యంగా చేసుకున్న పైఅధికారులు వేధింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్‌లో బాధితురాలు తెలిపింది. తన తప్పు లేని విషయాలకూ వేధించారని నాగేశ్వరి ఆరోపించింది. నాలుగు నెలలుగా సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని.. వారానికి ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వలేదని తెలిపింది. అత్యవసర సెలవులనూ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో వ్యవహరించిన తీరును ప్రశ్నించినందుకు ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పుకొచ్చింది. వారి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది.


మరోవైపు, నాగేశ్వరి మృతిపై ఆమె తల్లి రత్నమ్మ స్పందించారు. 'నా కూతురు మానసిక వేధింపులకు గురైంది. చిన్న చిన్న విషయాలకే ఆమెను వేధించేవారు. 15 రోజులుగా నా కుమార్తె మానసికంగా కుంగిపోయింది. పని చేసే చోట తనను వేధిస్తున్నారని ఆమె మాతో చెప్పింది. ఆత్మహత్య చేసుకునే ముందు డాలీ అనే సూపర్‌వైజర్ పేరు రాసింది. వేధింపులకు గురై, ఉద్యోగం కోల్పోవడంతో ఆత్మహత్య చేసుకుంది. నా కూతురికి న్యాయం చేయండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వరి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనతో పని ప్రదేశంలో వేధింపుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

శిరోమణి అకాలీ దళ్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటిస్తూ..

యువకులకు వలపు వల.. రూ.6కోట్లు వసూలు చేసిన యువతి..!

Updated Date - Aug 08 , 2026 | 08:37 PM