సైబర్ కేటుగాళ్లకు ఉరిశిక్ష!
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:08 AM
ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసి, ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లలో బంధించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలపై ఉక్కుపాదం మోపడానికి మయన్మార్ ప్రభుత్వం సిద్ధమైంది.
మయన్మార్ కీలక నిర్ణయం..
బిల్లుకు పార్లమెంటు ఆమోదం
నేపిడో, జూలై 28: ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసి, ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లలో బంధించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలపై ఉక్కుపాదం మోపడానికి మయన్మార్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు మయన్మార్ పార్లమెంట్ ‘ఆన్‌లైన్ మోసాల నిరోధక బిల్లు’కు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. స్కామ్ సెంటర్లలో నిర్బంధించి బాధితులను చిత్రహింసలకు గురిచేయడం వల్ల వారు మరణిస్తే, నిర్వాహకులకు నేరుగా మరణశిక్ష విధిస్తారు.
అలాగే అక్రమ నిర్బంధం, మానసిక, శారీరక హింసలకు పాల్పడే వారికి 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. మానవ అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆస్తులను జప్తు చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తారు. గత కొన్నేళ్లుగా ఐటీ ఉద్యోగాల పేరుతో భారత్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి యువతను మయన్మార్ సరిహద్దుల్లోని స్కామ్ సెంటర్లకు అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ వారి పాస్‌పోర్టులను లాక్కుని, రోజుకు 15 గంటలకు పైగా ఆన్‌లైన్ మోసాలు చేయిస్తున్నారు. తాజాగా వీరి వలలో తెలుగు రాష్ట్రాల యువత కూడా చిక్కుకుపోయారు. సింగపూర్‌కు తీసుకెళ్తామని చెప్పి సుమారు 100 మంది తెలుగు విద్యార్థులను సైబర్ నేరగాళ్లు మయన్మార్‌కు తరలించారు.