Share News

బిహార్ ముజఫర్‌పూర్‌లోని ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురి మృతి

ABN , Publish Date - Jun 04 , 2026 | 08:15 AM

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక 'ప్రసాద్ హాస్పిటల్' ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

బిహార్ ముజఫర్‌పూర్‌లోని ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురి మృతి
Bihar: 3 Dead After Massive Fire Breaks Out in Muzaffarpur Hospital ICU

ముజఫర్‌పూర్ (బిహార్)మే 4: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈరోజు (గురువారం) తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక 'ప్రసాద్ హాస్పిటల్' ఐసీయూ (Intensive Care Unit) వార్డులో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున సుమారు 3:55 గంటల సమయంలో ఆస్పత్రిలోని ఐదవ అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వార్డులో దాదాపు 13 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. దీనికి తోడు పక్కనే ఉన్న కార్డియాక్ కేర్ యూనిట్ (CCU) లోనూ పలువురు రోగులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆస్పత్రి అంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రాణభయంతో రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది అరుపులు, కేకలతో పరుగులు తీశారు.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, అత్యవసర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించి ఐసీయూలో చిక్కుకుపోయిన సుమారు 20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల అనంతరం ఐసీయూ, సీసీయూ వార్డుల్లోని మిగిలిన రోగులను వెంటనే సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై ముజఫర్‌పూర్ జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ సేన్ స్పందించారు. 'ప్రసాద్ ఆస్పత్రి ఐసీయూలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయినట్లు అధికారికంగా నిర్ధారించారు. సివిల్ సర్జన్ కూడా ఈ మరణాలను ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే కోణంలోనూ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని ఆయన తెలిపారు. ఇలా ఉండగా, ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్‌లో నిన్న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

డిస్కమ్‌లకు ఇంధన ‘సర్దు’బాటు

Updated Date - Jun 04 , 2026 | 08:56 AM