రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. ఆ స్కూటర్ దొరికేసింది
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:49 AM
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కోసం ఉపయోగించిన స్కూటర్‌ను పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం నిందితులు హోండా డియో స్కూటర్‌ను జుహులోనే వదిలేశారు. పోలీసులు జుహు నుంచి ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై, ఫిబ్రవరి 3: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాల్పులకు తెగబడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా కాల్పుల కోసం ఉపయోగించిన స్కూటర్‌ను పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం నిందితులు హోండా డియో స్కూటర్‌ను జుహులోనే వదిలేశారు. పోలీసులు జుహు నుంచి ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కూటర్ గురించి ఆరా తీయగా.. అది పుణెకు చెందిన వ్యక్తిదిగా తేలింది.
కాల్పులకు కొన్ని రోజుల ముందు నిందితుల్లో ఒకడైన ఆదిత్య గాయకి ఆ వ్యక్తి నుంచి 30 వేల రూపాయలకు స్కూటర్ కొన్నాడు. ఆ స్కూటర్ కొనే దగ్గరి నుంచి ముంబై తీసుకొచ్చే వరకు ఐదుగురు నిందితులు అమన్ ఆనంద్ మరోఠ్, స్వప్నిల్ బంధు సాకేత్, సిద్ధార్థ్ దీపక్ ఐన్‌పురే, సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ, ఆదిత్య జ్ణానేశ్వర్‌లకు దాని గురించి తెలియదు. స్కూటర్ ముంబై చేరుకున్న తర్వాత శుభం లంగ్‌కోర్ షూటర్(కాల్పులు జరిపిన వ్యక్తి)కు ఫోన్ చేసి స్కూటర్ గురించి చెప్పాడు. తను చెప్పిన చోటుకు వెళ్లి స్కూటర్‌ను తెచ్చుకోమన్నాడు.
షూటర్, మరో వ్యక్తి శుభం లంగ్‌కోర్ చెప్పిన చోటుకు వెళ్లారు. స్కూటర్‌ను తీసుకున్న తర్వాత దాని మీద రోహిత్ శెట్టి ఇంటి దగ్గరకు బయలు దేరారు. స్కూటర్ వెనకాల షూటర్ కూర్చోగా.. మరో వ్యక్తి స్కూటర్ నడిపాడు. రోహిత్ శెట్టి ఇంటి దగ్గరకు చేరుకోగానే ఇంటిపై షూటర్ నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ వెంటనే ఇద్దరూ స్కూటర్ మీద అక్కడినుంచి పరారయ్యారు. ప్లాన్ ప్రకారమే జుహులోని ఓ ప్రాంతంలో స్కూటర్‌ను వదిలేసి పారిపోయారు. చివరకు నిందితులందరూ పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యారు. నిందితులు ఐదుగురికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
హాస్పిటల్‌లో కాబోయే భర్త.. పెళ్లి కూతురి ఏడుపు.. పోలీసులు విచారణ చేస్తే..