ట్రెడ్‌మిల్ మోటార్‌లో బంగారం.. చైనా స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:54 AM
ముంబైలో భారీ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైనా జాతీయులు భారతీయ సహచరులతో కలిసి వాణిజ్య దిగుమతుల ముసుగులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ దర్యాప్తులో బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో భారీ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైనాకు సంబంధించిన కొంతమంది చట్టబద్ధమైన వాణిజ్య దిగుమతుల ముసుగులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. ముంబై జోనల్ యూనిట్ అధికారులు హాంకాంగ్ నుంచి ముంబై ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌కు వచ్చిన ఓ సరుకును తనిఖీ చేయగా.. ట్రెడ్‌మిల్ మోటార్‌లో అత్యంత చాకచక్యంగా దాచిన 691.870 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బయటపడింది. దీని విలువ సుమారు రూ.1.10 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఓ చైనా జాతీయుడితో పాటు దిగుమతి సంస్థను నిర్వహిస్తున్న మరో వ్యక్తిని కస్టమ్స్ చట్టం-1962 కింద అరెస్ట్ చేశారు. బంగారం స్వాధీనం అనంతరం ముంబై, చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు ప్రాంతాల్లో డీఆర్ఐ అధికారులు వేగంగా తదుపరి సోదాలు నిర్వహించారు.
మరోవైపు.. ఢిల్లీలోనూ భారీ విలువైన బంగారు ఆభరణం కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆగస్టు 19న ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు టర్కీ జాతీయులను టెర్మినల్-3 వద్ద అధికారులు అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వజ్రాలు పొదిగిన బంగారు కంకణం బయటపడింది. 750 ప్యూరిటీ కలిగిన ఈ బ్రాస్‌లెట్ బరువు 87.5 గ్రాములు కాగా.. అందులో సుమారు 50 క్యారెట్లు అంటే దాదాపు 10 గ్రాముల వజ్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని తాత్కాలిక విలువ రూ.1,07,86,301గా అంచనా వేశారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద బ్రాస్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. సెక్షన్ 104 కింద ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి