ముంబై 3.0కు శ్రీకారం
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:34 AM
జనారణ్యాన్ని తలపించే మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెరుగుతున్న అవసరాలు, జనాభా సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరో మహా నగరాన్ని నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది...
కర్నాల-సాయి-చిర్నెర్ కొత్త టౌన్..124 గ్రామాల్లో భూ సేకరణ
ముంబై, ఆగస్టు 19: జనారణ్యాన్ని తలపించే మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెరుగుతున్న అవసరాలు, జనాభా సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరో మహా నగరాన్ని నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముంబై-3.0గా పేర్కొంటున్న ఈ నగరం నవీ ముంబైకి ఆవల ఏర్పాటుకానుంది. కర్నాల-సాయి-చిర్నెర్(కేఎ్‌ససీ) పేరుతో రాయ్‌గడ్ జిల్లాలోని పన్వెల్, పెన్ తాలూకాల్లో ఉన్న 124 గ్రామాలు.. సమీప అర్బన్ ప్రాంతాల విలీనంతో దీనిని నిర్మించనున్నారు. ఇది మొత్తం 323.44 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త నగరానికి సంబంధించి ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎంఎంఆర్‌డీ).. ‘కొత్త పట్టణ అభివృద్ధి సంస్థ’(ఎన్‌టీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఈ నగరం అటల్ సేతు, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండనుంది. వాస్తవానికి ముంబై నగరాన్ని ఇప్పటికే విస్తరించారు. ఈ క్రమంలోనే నవీ ముంబైని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జనాసాంద్రత పెరుగుతున్న నేపథ్యంలో కొత్త పట్టణం ‘కేఎ్‌ససీ’ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నగరం కేవలం నివాసాలకే కాకుండా.. ఆర్థిక నగరంగా అవతరించనుంది. అదేవిధంగా వాణిజ్య కేంద్రాలు, సాంకేతిక హబ్బులు, లాజిస్టిక్స్, డేటా కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నవ నగరంలోనే కొత్తగా ఉద్యోగాలు కల్పించడం ద్వారా ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అవసరాన్ని తప్పించనున్నారు. మొత్తం 323.44 చదరపు కిలో మీటర్లలో 104 చదరపు కిలో మీటర్లను టౌన్ షిప్స్, పారిశ్రామిక కారిడార్లకు కేటాయిస్తారు. మిగిలిన ప్రాంతంలో హరిత కేంద్రాలు(గ్రీన్ జోన్స్), అటవీ ప్రాంతం అభివృద్ధి చేస్తారు. ముంబై-3.0కు కనెక్టివిటీ అత్యంత కలిసివచ్చే అంశమని అధికారులు చెబుతున్నారు. ముంబై-3.0 పూర్తిగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎంఎంఆర్‌డీఏ) కనుసన్నల్లోనే నిర్మాణం కానుంది. 2026-27 బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లను కేటాయించారు. భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. 124 గ్రామాల్లోని ప్రజలకు పరిహారం ప్రకటించారు. అయితే.. ఈ మహానగరం తొలిదశ 2030 నాటికి పూర్తికానుంది. ఆ తర్వాత అంచెలంచెలుగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..