డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రద్దు.. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:58 AM
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక ప్రక్రియను రద్దు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక ప్రక్రియను రద్దు చేసింది. మార్చి 22, 2026న జరిగిన స్క్రీనింగ్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది (MPSC Drug Inspector Exam Cancelled).
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎంపీఎస్‌సీ 2025 జూలై 29న విడుదల చేసింది. అనంతరం 2026 మార్చి 22న మహారాష్ట్రలోని ఆరు డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. జూన్ 12న పరీక్ష ఫలితాలను ప్రకటించగా.. 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. జూలై 1 నుంచి 22 వరకు 488 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేశారు. అయితే ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీఎస్‌సీకి ఫిర్యాదులు అందాయి (MPSC Drug Inspector Recruitment 2026).
పరీక్షకు రెండు రోజుల ముందే, మార్చి 20న కొందరికి ప్రశ్నలు తెలిశాయని, అవి సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ అయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఎంపీఎస్‌సీ జులై 27న ముంబై పోలీసులను ఆశ్రయించింది. అనంతరం క్రైమ్ బ్రాంచ్ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఆ విచారణలో కనీసం ఒక అభ్యర్థికి ప్రశ్నల సెట్ ముందుగానే అందినట్లు తేలింది. పరీక్షలో గోప్యత, పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడటంతో పాటు అభ్యర్థుల్లో కమిషన్‌పై నమ్మకాన్ని కొనసాగించేందుకు మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ఎంపీఎస్‌సీ ప్రకటించింది (MPSC Paper Leak).
తాజా నిర్ణయం కారణంగా ఇప్పటికే పరీక్ష రాసి, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా రద్దయినట్లే (Drug Inspector Exam). అయితే అభ్యర్థులకు ఎంపీఎస్‌సీ కాస్త ఊరటనిచ్చింది. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకే రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అంతేకాదు.. రీ-ఎగ్జామ్ కోసం ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని ఎంపీఎస్‌సీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..
కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..