Share News

భార్య ఘాతుకం.. భర్త నల్లగా ఉన్నాడని..

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:51 PM

భర్త నల్లగా ఉన్నాడన్న కారణంతో వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందో భార్య. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేయించింది.

భార్య ఘాతుకం.. భర్త నల్లగా ఉన్నాడని..
Priyanka Purohit case

భోపాల్, ఏప్రిల్ 10: మధ్య ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడన్న కారణంతో వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందో భార్య. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ధర్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల దేవ్ కృష్ణ పురోహిత్‌కు అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ప్రియాంకతో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ‘నువ్వు నల్లగా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నా కర్మ. నాకు నీకంటే బెటర్ మనిషి దొరుకుతాడు’ అంటూ ప్రియాంక తన భర్తను హింసించేది.


ఈ నేపథ్యంలోనే రాజ్‌ఘర్‌కు చెందిన కమ్‌లేశ్ పురోహిత్ అనే వ్యక్తితో ప్రియాంక వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి దేవ్ కృష్ణ అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే అతడి అడ్డుతొలగించుకోవడానికి మర్డర్ ప్లాన్ వేశారు. కమ్‌లేశ్ తన అనుచరుడు సురేంద్ర భక్తితో దేవ్ కృష్ణను చంపడానికి డీల్ కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయలకు డీల్ కుదిరింది. కమ్‌లేశ్ అడ్వాన్స్ కింద 50 వేల రూపాయలు ఇచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన సురేంద్ర భక్తి గ్యాంగ్.. దేవ్ కృష్ణ ఇంట్లోకి చొరబడింది.


నిద్రపోతున్న దేవ్ కృష్ణపై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందని ప్రియాంకను అడగ్గా.. దొంగతనానికి వచ్చిన వాళ్లు తన భర్తను చంపేశారని, ఇంట్లోని 3 లక్షల రూపాయలు విలువ చేసే నగలు దోచుకెళ్లారని చెప్పింది. అయితే, పదే పదే ఆమె మాటలు మారుస్తూ ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంట్లో సోదాలు నిర్వహించగా.. ఆమె దొంగతనానికి గురయ్యాయని చెప్పిన నగలు బయటపడ్డాయి. పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ డేటాను కూడా చెక్ చేయటంతో కమ్‌లేశ్‌తో ఉన్న సంబంధం బయటపడింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా మర్డర్ విషయం బయటపెట్టింది. పోలీసులు ప్రియాంకతో పాటు కమ్‌లేశ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సురేంద్ర కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అనంతపురంలో 'ఆపిల్' సిరి.. ఎడారి లాంటి నేలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Updated Date - Apr 10 , 2026 | 01:58 PM