Share News

జాడలేని మేఘాలు!

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:29 AM

దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో రుతుపవన మేఘాల జాడ కరువైంది. తాజా ఉపగ్రహ చిత్రాల్లో మేఘాల జాడ కనిపించడం లేదు. బుధవారం ఇస్రోకు చెందిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహం...

జాడలేని మేఘాలు!

  • దేశంలో 65 శాతం లోటు వర్షపాతం

న్యూఢిల్లీ, జూన్‌ 17: దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో రుతుపవన మేఘాల జాడ కరువైంది. తాజా ఉపగ్రహ చిత్రాల్లో మేఘాల జాడ కనిపించడం లేదు. బుధవారం ఇస్రోకు చెందిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహం, యూరోపియన్‌ వాతావరణ ఉపగ్రహం మెటియోశాట్‌, అమెరికా వాతావరణ సంస్థ ఎన్‌వోఏఏ తీసిన ఫొటోల్లో మధ్య, పశ్చిమ భారతాల్లోని అత్యధిక ప్రాంతాల్లో ఆకాశం మేఘ రహితంగా కనిపిస్తోంది. దీన్ని రుతుపవనాల పురోగతిలో స్పష్టమైన విరామంగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) గణాంకాల మేరకు ఈనెల 4 నుంచి 16వ తేదీ వరకు దేశంలో దాదాపు 65ు లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ నాట్లకు కీలకమైన ఈ సమయంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌లలోని అనేక జిల్లాలు, వాటికి అనుకొని ఉన్న ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. సీజన్‌ ప్రారంభంలో రుతుపవనాలు అసాధారణ వేగంతో కదలడమే తాజా విరామానికి కారణమని భావిస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకాలి. అయితే, ఈ ఏడాది 3రోజులు ఆలస్యంగా.. అంటే జూన్‌ 4న కేరళలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే చాలా వేగంగా దక్షిణ భారతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. ఆ తర్వాత ఈనెల 8 నుంచి అసలు రుతుపవనాల కదలికే లేదు. బంగాళాఖాతంలో బలమైన అల్పపీడన వ్యవస్థలు ఏర్పడకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సాధారణంగా జూన్‌లో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుపవనాల వ్యాప్తికి ఇంజన్ల వలే పనిచేస్తుంటాయి. రుతుపవన విరామానికి మరో కారణం ఎల్‌నినో. పొడి వాతావరణం జూలై వరకు కొనసాగితే గనుక.. వ్యవసాయంపై తీవ్రప్రభావం పడటంతోపాటు రిజర్వాయర్లలోనూ నీరు చేరక కష్టాలు తీవ్రమవుతాయనే ఆందోళన నెలకొంది.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 06:29 AM