మనీలాండరింగ్ కేసుల్లో ప్రతి రూ.100కు ఒక్క రూపాయే రికవరీ!
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:31 AM
మనీలాండరింగ్ కేసుల్లో ప్రతి రూ.100కు ఒక్క రూపాయిని మాత్రమే అధికారులు రికవరీ చేయగలుగుతున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. దర్యాప్తు అధికారులకు...
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 31: మనీలాండరింగ్ కేసుల్లో ప్రతి రూ.100కు ఒక్క రూపాయిని మాత్రమే అధికారులు రికవరీ చేయగలుగుతున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. దర్యాప్తు అధికారులకు అంతర్జాతీయ సహకారం లోపించడంతోపాటు ఆర్థిక నేరగాళ్లు అనుసరిస్తున్న అధునాతన పద్ధతులే దీనికి కారణమన్నారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో అంతర్జాతీయ సహకారం పూర్తిస్థాయిలో లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆర్థిక నేరాలపై నిర్వహించిన 43వ అంతర్జాతీయ సింపోజియంలో సీజేఐ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఏడాదిలో జరిగిన మనీలాండరింగ్ డబ్బుతో ఈ భూగోళంపై ఉన్న ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టా్‌పలు కొనవచ్చని, అప్పటికీ ఇంకా కొంత డబ్బు మిగిలే ఉంటుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నిర్వర్తించే అధికారులు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా ఉండటం కష్టమంటూ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న విషయాన్ని సీజేఐ ప్రస్తావించారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలోనే రాసిన ఆ పుస్తకంలో అక్రమ సంపాదనకు చెక్ పెట్టేందుకు ఆడిట్లు, క్రాస్ చెకింగ్, జప్తు చర్యలను సూచించారని తెలిపారు. ఇతర దేశాలతో నేరస్థుల అప్పగింత, పరస్పర న్యాయ సహాయ ఒప్పందాలు ఉన్నప్పటికీ అక్రమ ఆస్తుల రికవరీ అసంతృప్తికరంగానే ఉందని చెప్పారు. కాగా, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు 2017, 2018 సంవత్సరాలలోనే ఆర్థిక నేరగాళ్ల అప్పగింత ఒప్పందం మేరకు భారత్ చర్యలు ప్రారంభించింది. తొమ్మిదేళ్లు గడిచినా ఆ ఇద్దరు ఇప్పటికీ బ్రిటన్‌లోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి