Share News

మోదీ సర్కారుకు చుక్కెదురు!

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:00 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎఫ్‌సీఆర్‌ఏ, డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ మొదలైన అంశాలపై కీలక బిల్లులను ఆమోదించలేకపోవడంతో మొట్టమొదటిసారి మోదీ ప్రభుత్వానికి...

మోదీ సర్కారుకు చుక్కెదురు!

  • పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందని కీలక బిల్లులు

  • ఇక ఇల్లు చక్కదిద్దుకోవడానికి ప్రాఽధాన్యం

  • పార్టీ, క్యాబినెట్‌లో మార్పులపై దృష్టి

న్యూఢిల్లీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎఫ్‌సీఆర్‌ఏ, డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ మొదలైన అంశాలపై కీలక బిల్లులను ఆమోదించలేకపోవడంతో మొట్టమొదటిసారి మోదీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అంతర్జాతీయంగా కూడా ఒత్తిళ్లు ఎదురుకావడంతో దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారని రాజకీయ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌)కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయడంతో డీఎంకే కూడా పునరాలోచనలో పడిందని, ఈ విషయంలో మోదీ సర్కారుకు పరోక్ష మద్దతునిచ్చే ఆలోచన మానుకున్నదని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనతో బలం పుంజుకున్న ప్రతిపక్షాలు ఉభయ సభలను పూర్తిగా స్తంభించేలా చేయడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటుకు రాకపోవడం, మోదీ కూడా తన కార్యాలయానికే పరిమితం కావడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. అంతేకాక బీజేపీకి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలు కూడా ఎఫ్‌సీఆర్‌ఏ వంటి బిల్లులకు సహకరిస్తాయో లేదో అన్న భయం ఆ పార్టీ నేతల్లో నెలకొందని తెలుస్తోంది. ప్రతిపక్షాలు దాడి చేస్తుండగా విధేయులైన కొందరు ఎంపీలు తప్ప సీనియర్లు సహా పార్టీ నేతలు మౌనం పాటించడం మోదీ శిబిరాన్ని కలవరపరిచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ తన బలం పుంజుకునేందుకు వచ్చే మూడు నెలలు తీవ్ర ప్రయత్నం చేస్తారని ఈ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌పై మోదీ, అమిత్‌ షా దృష్టి సారించారని, పార్టీలోనూ, కేంద్ర క్యాబినెట్‌లోనూ మార్పులు ఈ దిశగా ఉంటాయని తెలుస్తోంది. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీఏ సమావేశాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారని తెలిసింది. నెలాఖరులోపు పార్టీకి సంబంధించిన మార్పులను ప్రకటిస్తారని, క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు కూడా మళ్లీ కసరత్తును వేగవంతం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటివరకు బీజేపీకి దూరంగా ఉన్న సీనియర్‌ నేతలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని మోదీ భావిస్తున్నారని, అందులోభాగంగానే మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, అహ్లూవాలియా తదితరులను పిలిపించుకుని చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:00 AM