Share News

పొదుపు మంత్రం!

ABN , Publish Date - May 14 , 2026 | 06:13 AM

పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో పొదుపు పాటించాలని, ఇంధనంతో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించుకోవాలని ఇటీవల పిలుపునిచ్చిన మోదీ.. ఆ చర్యల అమలును తనతోనే ప్రారంభించారు...

పొదుపు మంత్రం!

సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు

తనతోనే ప్రారంభించిన ప్రధాని మోదీ

కేవలం రెండు వాహనాలతో కాన్వాయ్‌

ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెంచాలని సూచన

ఇంధన పొదుపు కోసం ప్రభుత్వంలో విద్యుత్తు

వాహనాలు వినియోగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

తనతో సహా అన్నిస్థాయుల్లో కాన్వాయ్‌లను సగానికి

కుదించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం

ఇదే బాటలో పలు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా..

  • తనతోనే ప్రారంభించిన ప్రధాని మోదీ

  • కేవలం రెండు వాహనాలతోనే కాన్వాయ్‌

  • ఇంధన పొదుపు కోసం మార్పులు

  • అదే బాటలో పలువురు సీఎంలు, మంత్రులు

న్యూఢిల్లీ, మే 13: పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో పొదుపు పాటించాలని, ఇంధనంతో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించుకోవాలని ఇటీవల పిలుపునిచ్చిన మోదీ.. ఆ చర్యల అమలును తనతోనే ప్రారంభించారు. దీనిలో భాగంగా తన కాన్వాయ్‌ పరిణామాన్ని భారీగా తగ్గించుకున్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేవలం రెండు వాహనాల కాన్వాయ్‌తో ప్రయాణిస్తూ కనిపించారు. వీవీఐపీల ప్రయాణాల్లో కనిపించే భారీ కాన్వాయ్‌కు భిన్నంగా ఆయన రేంజ్‌ రోవర్‌, ఫార్చూనర్‌ వాహనాలతో మాత్రమే ప్రయాణించారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో సాయుధ మెర్సిడె్‌స-మేబ్యాక్‌ ఎస్‌650 గార్డ్‌, రేంజ్‌ రోవర్లు, టయోటా ఫార్చూనర్లు, ఎస్కార్ట్‌ వాహనాలు, జామర్‌ యూనిట్లు, డెకాయ్‌ కార్లు, అంబులెన్స్‌తో సహా దాదాపు 12 నుంచి 15 వరకూ వాహనాలు ఉంటాయి. అయితే పొదుపు చర్యలను ప్రోత్సహించడంతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా తన కాన్వాయ్‌లోని వాహనాలను 50ు వరకూ తగ్గించాలని, వాహన శ్రేణిలో విద్యుత్తు వాహనాల సంఖ్యను పెంచాలని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ)ను మోదీ ఆదేశించారు. అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశారు. కాగా, ‘బ్లూ బుక్‌’లో నిర్దేశించిన తప్పనిసరి భద్రతా ప్రొటోకాల్‌పై రాజీ పడకుండానే..కాన్వాయ్‌ కుదింపుపై ప్రధాని ఆదేశాలను ఎస్పీజీ అమలు చేయడం ప్రారంభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ప్రశంసించారు. తాను దేశానికి నిజమైన సేవకుడినని ఆయన మరోసారి నిరూపించుకున్నారని కొనియాడారు. తన కాన్వాయ్‌లోనూ వాహనాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.


మంత్రిత్వ శాఖల్లోనూ ప్రణాళికలు

ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు ఇంధన పొదుపు చర్యలు పాటించడంతో పాటు అనవసర ఖర్చులను తగ్గించుకొనే లక్ష్యంతో పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఉద్యోగులు మెట్రో సేవలను వినియోగించుకొనేలా ప్రోత్సహించడం, కార్‌ పూలింగ్‌ తదితర చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు ఇంధన పొదుపుపై ప్రధాని చేసిన విజ్ఞప్తి మేరకు అమిత్‌ షా సైతం తన కాన్వాయ్‌ పరిమాణాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధన పొదుపు చర్యల అమలు ప్రారంభమైంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ తమ కాన్వాయ్‌ల్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.

  • అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, సమావేశాలకు వర్చువల్‌గా హాజరు కావాలని మంత్రులను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మంత్రుల కాన్వాయ్‌ల్లో తక్షణమే 50ు కోతలు విధిస్తూ సీఎం ఫడణవీస్‌ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను ప్రభుత్వం రద్దు చేసింది.

  • గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తన కాన్వాయ్‌ను రెండు వాహనాలకు పరిమితం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాలకు హెలికాప్టర్‌ వినియోగించకూడదని గుజరాత్‌ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, టీచర్లు సైకిళ్లు, ఈవీలకు ప్రాధాన్యం ఇచ్చేలా వారంలో ఒకరోజును ‘కెమికల్‌ ఇంజన్‌ ఫ్రీ డే’గా పాటించాలని వర్సిటీల వీసీలను ఆదేశించారు. ఢిల్లీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు వీలైనంత తక్కువగా వాహనాలను వినియోగించాలని సీఎం రేఖా గుప్తా ఆదేశించారు. బస్సులు, మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.

  • మంత్రులు, అధికారులు తమ కాన్వాయ్‌ల పరిమాణాన్ని 50ు తగ్గించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. వర్క్‌ ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్యాలయాలను కోరారు. బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధరి తన కాన్వాయ్‌ను కుదించాలని ఆదేశించారు. పొదుపు చర్యల్లో భాగంగా గవర్నర్‌, సీఎం, మంత్రులు, అధికారుల కాన్వాయ్‌లను తగ్గించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా రాష్ట్రాల్లో నాయకులు కూడా ఇలాంటి పొదుపు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటలను రద్దు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 06:13 AM