సగం మందికి ఉద్వాసన?
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:13 AM
ఈ నెల మూడో వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరపాలని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నట్లు...
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన.. కొత్తవారికి అవకాశం ఇచ్చే యోచనలో ప్రధాని
నెలాఖరులో ప్రత్యేక సమావేశాలు!
బ్రిక్స్ సదస్సు ముగిశాక నిర్వహణ?
డీ లిమిటేషన్, మహిళా బిల్లుల ఆమోదానికి అధికారపక్షం ప్రయత్నం
పార్లమెంటు సమావేశాల తర్వాత కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ
డీఎంకే, ఎన్సీపీ(పవార్) ఎన్డీయేలో చేరే చాన్స్.. ఆ పార్టీలకు కీలక పదవులు?
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈ నెల మూడో వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరపాలని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం అధికారపక్షానికి సమకూరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 12-13వ తేదీల్లో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని, ఈ నెల మూడోవారంలో అవి జరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. కాగా, గత కొంతకాలంగా మంత్రివర్గంలో మార్పులపై కసరత్తు చేస్తున్న మోదీ.. దాంట్లో భాగంగా కేంద్ర క్యాబినెట్, సహాయ మంత్రుల పనితీరును సమీక్షిస్తున్నారు. సగానికి పైగా మంత్రులకు ఉద్వాసన చెప్పాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పైగా, ఇప్పటికే మంత్రివర్గంలో పన్నెండు ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పలువురు కొత్తవారికి ప్రధాని మోదీ అవకాశం కల్పించనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో కీలకమైన ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఎన్డీఏలో కొత్తగా చేరిన పార్టీలు, ప్రస్తుతం పలు శాఖలు నిర్వహిస్తున్న మంత్రులపై ఉన్న పనిభారం తదితర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రధాని నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోవైపు, 37 మంది ఎంపీలున్న డీఎంకే, ఆరుగురు ఎంపీలున్న ఎన్సీపీ(పవార్) కూడా ఎన్డీఏలో చేరి, కేంద్ర మంత్రివర్గంలో పదవులు తీసుకునే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ రెండు పార్టీలు మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖలు కోరుతున్నట్లు సమాచారం. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు కూడా కేంద్ర మంత్రివర్గంలో కీలకస్థానం లభిస్తుందని, శ్రీకాంత్ షిండేకు చోటు కల్పిస్తారని భావిస్తున్నారు. పంజాబ్‌లో రాఘవ్ చడ్డా నేతృత్వంలో ఎన్డీఏ గూటికి చేరిన ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీలలో కొందరికి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి మంత్రివర్గంలో సముచిత స్థానం లభించే అవకాశాలున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు