Share News

పోటీ కాదు, సహకారమే మన భవిష్యత్తు: మనీలా ఆసియాన్ సదస్సులో మోదీ పిలుపు

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:04 PM

పోటీ కాదు, సహకారమే మన భవిష్యత్తును నిర్దేశించాలని మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

పోటీ కాదు, సహకారమే మన భవిష్యత్తు: మనీలా ఆసియాన్ సదస్సులో మోదీ పిలుపు
PM Modi ASEAN Summit

ఆంధ్రజ్యోతి, నవంబర్ 17: భారత్-ఆసియాన్ (ASEAN) దేశాల కూటమి కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, కాబట్టి మన ఉమ్మడి భవిష్యత్తును పోటీ (Competition) కాకుండా పరస్పర సహకారం (Cooperation) నిర్దేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇవాళ (మంగళవారం) ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఇండియా-ఆసియాన్ (India-ASEAN) సదస్సులో 11 సభ్య దేశాల నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. (PM Modi ASEAN Summit)


ఈ భాగస్వామ్యంలో ఆసియాన్ ఐక్యత, దాని కీలక భూమికకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 'గడిచిన కొన్నేళ్లుగా ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. నేడు ప్రపంచానికి అత్యంత అవసరమైనది శాంతి, స్థిరత్వం, ఊహించదగిన భవిష్యత్తు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సదస్సు ఇతివృత్తమైన 'నావిగేటింగ్ అవర్ ఫ్యూచర్, టుగెదర్' కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది' అని మోదీ పేర్కొన్నారు.


ఈ ప్రాంతాన్ని శాంతి, స్థిరత్వానికి చిహ్నంగా మార్చే శక్తి, సంకల్పం భారత్, ఆసియాన్ రెండింటికీ ఉన్నాయని ప్రధాని అన్నారు. 'భారతదేశ అభివృద్ధి, ఆసియాన్ శ్రేయస్సు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో 'ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045', 'వికసిత భారత్ 2047' (Developed India 2047) లక్ష్యాలు మన ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి' అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


నేటి ఈ సమావేశం మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు, సురక్షితమైన, సమ్మిళిత, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.


1967లో ఏర్పాటైన ఆసియాన్ (Association of Southeast Asian Nations) కూటమి ఆగ్నేయాసియా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం, భద్రత, సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, తైమూర్-లెస్టే (Timor-Leste), వియత్నాం సహా మొత్తం 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఈ కూటమికి డైలాగ్ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 17 , 2026 | 03:11 PM