పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు.. పోలీసులకు సమాచారం ఇవ్వనున్న మెటా..
ABN , Publish Date - Sep 15 , 2026 | 12:37 PM
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, భద్రతకు సంబంధించిన కేసులను సంబంధిత దర్యాప్తు సంస్థలకు నివేదించేందుకు మెటా అంగీకరించింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, భద్రతకు సంబంధించిన కేసులను సంబంధిత దర్యాప్తు సంస్థలకు నివేదించేందుకు మెటా అంగీకరించింది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పిల్లల ఆన్‌లైన్ భద్రత అనేది భారత్‌లో పనిచేస్తున్న ప్రతి సోషల్ మీడియా సంస్థకు తప్పనిసరి అని, రాజీపడలేని అంశమని అని కేంద్రం స్పష్టం చేసింది (Meta child safety India).
తాజాగా మెటా తీసుకున్న నిర్ణయం పిల్లలకు సోషల్ మీడియాను మరింత సురక్షితంగా మార్చే దిశలో తొలి అడుగు మాత్రమేనని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ఇకపై మెటా తమ ప్లాట్‌ఫామ్‌లలో పిల్లలపై లైంగిక దాడికి సంబంధించిన కంటెంట్ లేదా కార్యకలాపాలను గుర్తించినప్పుడు అధికారులకు సమాచారం అందించనుంది. వీడియోలు లేదా ఫొటోలు అప్‌లోడ్ అవుతున్న సమయంలోనే అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తించేందుకు ఇమేజ్-మ్యాచింగ్ టెక్నాలజీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి విధానాలను మెటా ఉపయోగిస్తోంది (Child safety social media India).
పిల్లలకు సంబంధించిన లైంగిక దాడి కంటెంట్ విషయంలో కేంద్రం ఇటీవల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది (Meta law enforcement India). సోషల్ మీడియా సంస్థలు కేవలం ఫిర్యాదు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, హానికరమైన కంటెంట్‌ను ముందుగానే గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఇటీవల మెటాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..