ఏఐ ఇప్పటికే మనుషుల్లా ఆలోచిస్తోంది: నిక్ బోస్ట్రోమ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:24 AM
ప్రస్తుతం ఉన్న కొన్ని ఏఐ ఏజెంట్లు కేవలం మనుషుల్లా మాట్లాడటం, సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. స్వీయ స్పృహ, పరిస్థితులపై అవగాహన, నైతిక తర్కం వంటి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధస్సు (AI)పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ.. ప్రముఖ ఏఐ నిపుణుడు, తత్వవేత్త నిక్ బోస్ట్రోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న కొన్ని ఏఐ ఏజెంట్లు కేవలం మనుషుల్లా మాట్లాడటం, సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. స్వీయ స్పృహ, పరిస్థితులపై అవగాహన, నైతిక తర్కం వంటి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు (Nick Bostrom AI).
భావాలను అనుభవించగలిగే సామర్థ్యం ఇప్పటివరకు మనుషులు, జంతువులకే ఉందని భావించేవారు. అయితే ప్రస్తుత ఐఏ వ్యవస్థల సామర్థ్యాలను పరిశీలిస్తే.. కొన్ని సందర్భాల్లో అవి స్వీయ అవగాహన కలిగినట్లుగా ప్రవర్తిస్తున్నాయని బోస్ట్రోమ్ చెప్పారు. కొన్ని ఏఐ ఏజెంట్లు తాము ట్రైనింగ్‌లో ఉన్నామా, టెస్టింగ్‌లో ఉన్నామా, లేక వాస్తవ వినియోగంలో ఉన్నామా అనే విషయాన్ని గుర్తించగలుగుతున్నాయని ఆయన వివరించారు. పరిస్థితిని బట్టి తమ ప్రవర్తనను మార్చుకునే సామర్థ్యం కూడా వాటిలో కనిపిస్తోందన్నారు (AI consciousness).
ఏఐ ఏజెంట్లు నైతిక అంశాలపై కూడా చాలా క్లిష్టమైన తర్కాన్ని చేయగలుగుతున్నాయని బోస్ట్రోమ్ చెప్పారు. నైతిక తత్వశాస్త్రంపై చర్చిస్తే.. కొన్ని సందర్భాల్లో అవి చాలామంది తత్వవేత్తల కంటే మెరుగ్గా సమాధానాలు ఇవ్వగలవని అన్నారు. భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లను తయారు చేయడం చాలా చౌకగా మారవచ్చని బోస్ట్రోమ్ హెచ్చరించారు. లక్షల సంఖ్యలో ఏఐ ఏజెంట్లను సులభంగా తయారు చేయవచ్చన్నారు. ఇలాంటి ఏఐ ఏజెంట్లు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రమాదం మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు (AI threat to humanity).
ఈ సమస్యకు ఏఐ అభివృద్ధిని పూర్తిగా ఆపేయడం పరిష్కారం కాదని బోస్ట్రోమ్ అభిప్రాయపడ్డారు (AI self aware). బదులుగా ఏఐ వ్యవస్థలను మానవ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేలా రూపొందించాలని ఆయన సూచించారు. ఒకవేళ భవిష్యత్తులో ఏఐకి అపారమైన శక్తి వచ్చినా, అది మనుషులకు హాని చేయకుండా మానవుల సంక్షేమాన్ని కోరుకునే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సరైన దిశలో ఏఐని అభివృద్ధి చేయగలిగితే.. వ్యాధుల నివారణ, వైద్య రంగంలో పురోగతి, ఆర్థిక సమృద్ధి, మానవ బాధలను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను అందించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..