Share News

ఐటీ అధికారులతో మెటా ప్రతినిధుల భేటీ

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:21 AM

వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో.. మెటా ప్రతినిధులు శుక్రవారం కేంద్ర ఐటీ శాఖ అధికారులను కలిశారు. ఈ ఫీచర్‌పై...

ఐటీ అధికారులతో మెటా ప్రతినిధుల భేటీ

8 వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై అధికారుల ఆందోళన

న్యూఢిల్లీ, జూలై 3: వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో.. మెటా ప్రతినిధులు శుక్రవారం కేంద్ర ఐటీ శాఖ అధికారులను కలిశారు. ఈ ఫీచర్‌పై పూర్తి వివరాలను 3 రోజుల్లోగా తెలపాలని కేంద్రం తన నోటీసుల్లో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మెటా ప్రతినిధులు అధికారులను కలిశారని, ఈ ఫీచర్‌పై ప్రభుత్వానికి ఉన్న ఆందోళన గురించి అధికారులు వారికి వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూజర్‌నేమ్‌ ఫీచర్‌తో సైబర్‌ నేరాలు జరిగే ప్రమాదం ఉన్నందునే తాము వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి వివరణ కోరినట్టు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ తెలిపారు. మరోవైపు.. ఇన్‌స్టాగ్రామ్‌ రికమెండేషన్‌ అల్గారిథమ్‌ బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ బీబీసీలో వచ్చిన ఒక పరిశోధనాత్మక కథనంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందించారు. ఈ అంశంపై మెటా సంస్థకు సమన్లు జారీ చేసి, వివరణ కోరాల్సిందిగా తన శాఖ అధికారులను ఆయన ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫేస్‌బుక్‌లో కూడా ఇదే తరహాలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయని బీబీసీ తన కథనంలో పేర్కొనడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 06:21 AM