Share News

2007 ఫార్ములాతోనే ఈసారి యూపీ ఎన్నికలకు మాయావతి

ABN , Publish Date - May 24 , 2026 | 08:43 PM

వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వవైభవం సంతరించుకోవాలనే పట్టుదలతో బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి ఉన్నారు. ఇందుకోసం పాత ఫార్ములానే తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నారు.

2007 ఫార్ములాతోనే ఈసారి యూపీ ఎన్నికలకు మాయావతి
Mayawati

లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వవైభవం సంతరించుకోవాలనే పట్టుదలతో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సుప్రీం మాయావతి (Mayawati) ఉన్నారు. ఇందుకోసం పాత ఫార్ములానే తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నారు. 2007లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన 'సోషల్ ఇంజనీరింగ్' ఫార్ములాతోనే ఈసారి ఎన్నికలకు వెళ్లనున్నారు. ఈ ఫార్ములాతో బ్రాహ్మణులు, దళితులు, ముస్లింలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మాయావతి అప్పట్లో సక్సెస్ అయ్యారు.


మాయావతి అధ్యక్షతన పార్టీ సీనియర్ నేతలతో ఆదివారంనాడిక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోషల్ ఇంజనీరింగ్ ఫార్మూలాతో ఎన్నికలకు సిద్ధం కావాలని మాయావతి సంకేతాలు ఇచ్చారు. బీఎస్‌పీ ఒక్కటే అన్ని కమ్యూనిటీల (సర్వ సమాజ్) ప్రయోజనాలను పరిరక్షించ గలదని, బీఎస్‌పీ హయాంలో బ్రాహ్మణులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు తగిన గౌరవం ఇచ్చామని గుర్తుచేశారు. పార్టీ ప్రధాన ఓటర్లయిన దళితులతో పాటు ముస్లింలు, బ్రాహ్మణులు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు పార్టీ నేతలు చేరువ కావాలని దిశానిర్దేశం చేశారు.


సోలోగానే..

2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే మాయావతి ప్రకటించారు. ఈసారి పార్టీ మంచి ఫలితాలను సాధించాలని, బ్రాహ్మణులను పార్టీ వైపు తిప్పుకుంటే కనీసం 'కింగ్ మేకర్'గానైనా పార్టీ నిలుస్తుందని ఈ సమావేశంలో మాయావతి సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో ముస్లింల ఓట్ల విభజన జరిగితే అది సమాజ్‌వాది పార్టీ-కాంగ్రెస్ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉటుంది. బ్రాహ్మణుల ఓట్లు చీలితే బీజేపీపై ఆ ప్రభావం ఉంటుంది. గత దశాబ్దకాలంగా బీఎస్‌పీ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ కేవలం 17 సీట్లు గెలుచుకుంది. 22 శాతం ఓటింగ్ షేర్ సాధించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. 12.9 శాతం ఓటింగ్‌తో కేవలం రెండే సీట్లు దక్కించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకుండానే బీఎస్‌పీ చతికిలపడింది.


ఇవి కూడా చదవండి..

ఫల్టా రీపోలింగ్‌.. బీజేపీ లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం

బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.?

Updated Date - May 24 , 2026 | 08:46 PM