Share News

ఫల్టా రీపోలింగ్‌.. బీజేపీ లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం

ABN , Publish Date - May 24 , 2026 | 07:06 PM

పశ్చిమబెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్ ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పాండా తన సమీప సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై 1,09,021 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఫల్టా రీపోలింగ్‌.. బీజేపీ లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం
Debangshu Panda

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ఫల్టా (Falta) అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్ ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పాండా (Debangshu Panda) తన సమీప సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై 1,09,021 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పాండాకు 1,49,666 ఓట్లు పోలవ్వగా, కుర్మికి 40,645 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజ్జాక్ మొల్లాకు 10,084 ఓట్లు పోలయ్యాయి. పోటీ నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు సైతం 7,783 ఓట్లు వచ్చాయి.


ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌లో అవకతవకలు చోటుచేసుసుకున్నట్టు ఎన్నికల కమిషన్ నిర్ధారించి ఫల్టాలోని 285 పోలింగ్ బూత్‌లతో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఇటీవల రీపోలింగ్ జరుగగా, ఎన్నికల ఫలితాలను ఆదివారంనాడు ప్రకటించారు. కాగా, పోలింగ్‌కు ముందే ఫల్టా నియోజకవర్గం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ప్రకటించడం ఇటీవల సంచలనమైంది.


అభిషేక్ బెనర్జీ ఆక్షేపణ

కాగా, ఫల్టాలో వెలువడిన ఫలితాన్ని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రశ్నించారు. కౌంటింగ్ ప్రక్రియలో తేడాలని తప్పుపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి 21 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయిందని, అయితే మే 4న ఇదే సమయానికి కేవలం 2 నుంచి 4 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే జరిగిందని అన్నారు. కౌటింగ్ ప్రక్రియలో ఇంత వ్యత్యాసం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై దేశ ప్రజలకు ఈసీఐ వివరణ ఇవ్వాలన్నారు. ఫల్టా నుంచి గత పది రోజుల్లో 1,000 మంది వర్కర్లు ఇళ్లు వదిలి పారిపోయారని, అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగానే తమ పార్టీ కార్యాలయాన్ని పట్టపగలే ధ్వసం చేశారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అభిషేక్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.?

డీఎంకే కష్టకాలంలో ఆదుకున్నాం.. ఉదయనిధికి కాంగ్రెస్ కౌంటర్

Updated Date - May 24 , 2026 | 07:12 PM