ముసుగు మహిళ ఎంట్రీ.. కాసేపటికే ఘోర అగ్నిప్రమాదం! సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:16 PM
ఢిల్లీలోని గోవిందపురిలో జరిగిన అగ్నిప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. రాత్రి గం.2:23 ప్రాంతంలో ముసుగు ధరించిన ఓ మహిళ సదరు బిల్డింగ్‌లోకి వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
న్యూఢిల్లీ, జూన్ 14: దేశ రాజధాని ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన కొత్త మలుపు తిరిగింది. శుక్రవారం రాత్రి 2:23 గంటలకు ముసుగు ధరించిన ఓ మహిళ సదరు బిల్డింగ్‌లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని గలీ నం.1లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజీలో ఆ మహిళ దుపట్టాతో ముఖాన్ని కప్పుకుని భవనంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె భవనంలోకి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత, గేటు లోపలి నుంచి ఒక్కసారిగా వెలుగులు విరజిమ్మాయి. ఆ తర్వాత ఆ మహిళ భవనం నుంచి వేగంగా బయటకు నడుస్తూ వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆమె పాత్ర ఏంటనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. ఆమెనే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీ సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ గుర్తింపు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి దారితీసిన ఘటనల క్రమాన్ని అధికారులు పునర్నిర్మిస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాత్రి 2:31 గంటలకు అగ్నిప్రమాదం గురించి పీసీఆర్ కాల్ అందిందని, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, పొగతో నిండిన భవనంలో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్క్ చేసిన పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు అంతకుముందు ప్రకటించారు. అయితే.. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇందులో కుట్ర కోణం ఉందేమోనని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో సదరు బిల్డింగ్‌లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన పంకజ్(28), అతని అమ్మమ్మ సుశీలా దేవి(70), సోదరి సోని(20) మరణించారు. పంకజ్ తల్లి గుద్దీదేవి(50), బంధువు మోని(18) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇలా ఉండగా, దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న 'బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి, విదేశీయులతో సహా 23 మంది మరణించిన పది రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..
జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ