మారుతి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారొచ్చేసింది!
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:33 AM
దేశీయంగా తయారుచేసిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. వ్యాగన్ ఆర్‌ను మారుతి సుజుకీ సంస్థ గురువారం విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ సంస్థ బుధవారంనాడు దేశంలోనే తొలిసారి..
85, 100% ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్‌ను ఆవిష్కరించిన మారుతి సుజుకీ
దేశంలోని మరికొన్ని ప్రముఖ కార్లు, బైకుల కంపెనీలు కూడా ఇదే బాటలో
ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను ప్రోత్సహించేందుకు సర్కారు విస్తృత ప్రణాళికలు
20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా వచ్చిన ప్రయోజనాలనే ఇప్పటిదాకా
ప్రజలకు మళ్లించని ప్రభుత్వం.. నేటికీ అధిక ధరలకే పెట్రోల్ విక్రయం
ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల ధరలు ఎక్కువ.. వాటి మైలేజీ కూడా తక్కువ
ఈ85, ఈ100 ఇంధనాలను అధిక ధరలకు అమ్మితే ప్రజలకు నష్టమే
వాటి ధర రూ.80-82లోపు ఉంటేనే ప్రజలకు ప్రయోజనం: నిపుణులు
న్యూఢిల్లీ, జూన్ 4: దేశీయంగా తయారుచేసిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. వ్యాగన్ ఆర్‌ను మారుతి సుజుకీ సంస్థ గురువారం విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ సంస్థ బుధవారంనాడు దేశంలోనే తొలిసారి రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్ల (స్ల్పెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్‌ఎ్‌ఫ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్)ను విడుదల చేయగా.. ఆ మర్నాడే మారుతి ఈ ఫ్లెక్స్ ప్యూయల్ కారును తేవడం విశేషం. ఈ కారు ఈ20 (అంటే 20ు ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం) నుంచి ఈ22, ఈ25, ఈ30, ఈ85, ఈ100.. ఇలా అన్ని రకాల మిశ్రమ ఇంధనాలతో నడుస్తుంది. దేశ ఇంధన భద్రత, సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన వ్యాగన్ ఆర్‌ను తీసుకువచ్చినట్టు మారుతి పేర్కొంది. భారత్ ఏటా భారీ స్థాయిలో ముడిచమురును దిగుమతి చేసుకుంటోందని.. ఇథనాల్ వంటి బయో ఇంధనాలు ఈ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమేకాకుండా మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.ఇక.. మిశ్రమ ఇంధనాలతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు.. మనం చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, విలువైన విదేశీ మారక నిల్వలను ఆదా చేయడానికి, కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మరో మంత్రి హర్‌దీ్‌పసింగ్ పురీ అన్నారు. ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో భాగంగా తొలిదశలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో, మహారాష్ట్రలోని పుణె, ముంబై, నాగపూర్‌లో 50 నుంచి 100 ఇథనాల్ ఫ్యూయెల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని.. ఏడాది చివరకు ఆ సంఖ్యను 500కు విస్తరిస్తామని ఆయన తెలిపారు. 2027 చివరినాటికి దేశవ్యాప్తంగా 5000 ఇథనాల్ ఫ్యూయెల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ధరల తగ్గింపు, రోడ్ ట్యాక్స్ మినహాయింపుల వంటివాటిని కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రోత్సాహం.. ప్రోత్సాహకాలు..
వాయుకాలుష్య కారకాలైన కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు.. ముడిచమురు దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడం, అదే సమయంలో దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చడం.. రైతులను అన్నదాతలుగానే కాక, ఇంధన దాతలుగా మార్చడం.. ఇలా పలు లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం మిశ్రమ ఇంధన వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే తొలి దశలో ఈ5తో మొదలుపెట్టి.. ఈ10కి, ఆ తర్వాత ఈ20 ఇంధనాన్ని.. అంటే ఇథనాల్ 10 శాతం, పెట్రోల్ 90 శాతం ఉండే మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు ఈ-85, ఈ-100 ఇంధనాల వినియోగం దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే కార్లు, బైకుల కంపెనీలు.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లను తయారుచేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అందుకోసం ప్రభుత్వం రూ.25,938 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ20 లక్ష్యాన్ని ఇప్పటికే సాధించిన నేపథ్యంలో.. ఈ22, ఈ25, ఈ30, ఈ85 ఇంధనాలకు సంబంధించిన అధికారిక ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఇంధనాలు అందుబాటులోకి వస్తే.. వాహనదారులు బంకులకు వెళ్లినప్పుడు తమ వాహన ఇంజన్‌ను బట్టి ఈ ఇంధనాల్లో తమకు కావాల్సినదాన్ని ఎంచుకోవచ్చు. అంటే, ఇప్పుడు.. మామూలు పెట్రోలు, ప్రీమియం పెట్రోలు ఉన్నట్టు భవిష్యత్తులో ఐదారు రకాల మిశ్రమ ఇంధనాలు వస్తాయన్నమాట. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతగా ప్రోత్సహిస్తుండడంతో.. మరిన్ని వాహన కంపెనీలూ ఈ తరహా వాహనాల తయారీకి విస్తృతంగా కృషి చేస్తున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హోండా, యమహా, సుజుకీ వంటి బైక్ కంపెనీలు, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కార్ల కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి.
ప్రజలకు ప్రయోజనం ఏదీ?
ప్రస్తుతం బంకుల్లో విక్రయిస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలుపుతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు మనకు పెట్రోల్ రేటు తగ్గాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడూ తక్కువ రేటుకు విక్రయించలేదు. కంపెనీల నష్టాల పూడ్చివేత పేరుతో అధిక ధరలనే వసూలు చేస్తోంది. అందుకే ఈ25, ఈ30, ఈ85, ఈ100 ఇంధనాల ధరలపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇథనాల్‌తో నడిచే వాహనాల మైలేజీ తక్కువగా ఉంటుంది. ఈ వాహనాల ధరలు కూడా మామూలు వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ధర ఎక్కువ, మైలేజీ తక్కువ ఉంటుంది కాబట్టి.. ఈ వాహనాలకు వినియోగించే ఇంధనం ధరలను వీలైనంత తక్కువగా ఉంచితేనే ప్రజలకు ప్రయోజనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి ధరలు రూ.80-82 లోపు ఉంటే మంచిదని వారు సూచిస్తున్నారు. ఇథనాల్ కొనుగోలు ఖర్చు సగటున లీటరుకు రూ.71.55 దాకా పడుతోంది. కాబట్టి.. ప్రభుత్వం అత్యాశకు పోయి సుంకాల పేరిట అదనంగా బాదకపోతే.. ఇథనాల్‌ను రూ.80-82 ధరకు విక్రయించడం సాధ్యమేనన్నది నిపుణుల మాట.
అంత ఇథనాల్ ఉందా.. భవిష్యత్తులో సరిపోతుందా?
ఇథనాల్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది సరే! భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల వినియోగం భారీగా పెరిగితే? ఇథనాల్ తయారీ సామర్థ్యం అందుకు తగ్గట్టుగా ఉందా? అంటే.. ప్రభుత్వం ఆ దిశగా కూడా భారీ కసరత్తు చేస్తోంది. మన దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2025 నవంబరు నాటికి ఏడాదికి దాదాపు 1990 కోట్ల లీటర్లకు చేరింది. ప్రస్తుత అవసరాలకు 1350 కోట్ల లీటర్లు సరిపోతున్నాయి. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే తట్టుకోవడానికి ప్రభుత్వం కేవలం చెరకు, మొక్కజొన్న వంటివాటిపైనే కాకుండా పాడైపోయిన ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు, వెదురు వంటివాటిపై దృష్టి సారించింది. వాటి నుంచి ఇథనాల్ తయారు చేయడానికి ఇప్పటికే వందలాది కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. హరియాణాలోని పానిపట్ వంటి చోట్ల అత్యాధునిక 2జీ ఇథనాల్ ప్లాంట్లు పెట్టింది. ఇవి పంట వ్యర్థాల నుంచి ఇథనాల్ తీస్తాయి. ఈ చర్యల వల్ల.. ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరతా రాకుండానే వాహనాలకు అవసరమైన ఇథనాల్ అందుబాటులోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!