Share News

మణిపూర్‌లో నాగా గ్రామంలో దుండగుల బీభత్సం.. ఇళ్లకు నిప్పు

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:16 AM

మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన కలకలం రేపింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని నాగా గ్రామంపై సాయుధ దుండగులు కాల్పులు జరిపి, ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు తొమ్మిది ఇళ్లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను మోహరించారు.

మణిపూర్‌లో నాగా గ్రామంలో దుండగుల బీభత్సం.. ఇళ్లకు నిప్పు
Manipur Latest News

ఇంటర్నెట్ డెస్క్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని టోక్‌పా లియాంగ్‌మై నాగా గ్రామంలో మంగళవారం రాత్రి సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. రాత్రి 9.30 గంటల సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన దుండగులు.. పలుమార్లు కాల్పులు జరిపి, అనంతరం ఇళ్లకు నిప్పంటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు తొమ్మిది ఇళ్లు దగ్ధమైనట్లు వెల్లడించారు. ఎక్కువగా కచ్చా ఇళ్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడంలో స్థానికులు సహకరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఆ ప్రాంతంలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు.


ఈ దాడిని లియాంగ్‌మై నాగా కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. మరో వర్గానికి చెందిన సాయుధ వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారని కౌన్సిల్ ఆరోపించింది. దాడిలో 10 ఇళ్లు, ఒక చర్చి కూడా దగ్ధమైనట్లు పేర్కొంది. అమాయక పౌరులు, నివాస గృహాలు, ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం తీవ్రమైన హింసాత్మక చర్యగా అభివర్ణించింది. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

అదానీకి భారీ ఊరట

Updated Date - Aug 12 , 2026 | 11:38 AM