Share News

పెట్రోల్ బంక్‌లో స్మోకింగ్ చేయొద్దు అన్నందుకు.. బైక్‌కు నిప్పంటించిన యువకుడు..

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:39 PM

పెట్రోల్ బంక్‌లో ధూమపానం చేయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి బైక్ పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది..

పెట్రోల్ బంక్‌లో స్మోకింగ్ చేయొద్దు అన్నందుకు.. బైక్‌కు నిప్పంటించిన యువకుడు..
Raipur petrol pump fire

రాయ్‌పుర్‌, ఫిబ్రవరి 20: ఎవరైనా మంచి చెప్తే.. వారిపై కొందరు పగ పెంచుకుంటారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో ఫలానా పని చేయకూడదు అంటే.. అదే పని చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు పెను ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశాడు. పెట్రోల్ బంకులో(petrol pump fire) సిగరెట్ కాల్చొద్దన్నందుకు ఏకంగా బంకునే తగలబెట్టినంత పనిచేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఛత్తీస్‌గఢ్( Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పుర్‌ జిల్లాలోని ఉర్ల ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 19) రాత్రి 7.40 గంటల సమయంలో ధర్మేంద్ర క్షత్రి, ఇమ్రాన్ అనే ఇద్దరు స్నేహితులు బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. ఇమ్రాన్ బైక్‌పై కూర్చుని పెట్రోల్ కొట్టిస్తుండగా.. వెనుక కూర్చున్న ధర్మేంద్ర కిందకు దిగాడు. ఒకవైపు బైక్‌కు పెట్రోల్ కొడుతుంటే.. ధర్మేంద్ర సిగరెట్ వెలిగించే ప్రయత్నం చేశాడు. అయితే పెట్రోల్ బంకులో ధూమపానం చేయొద్దని బైకుపై ఉన్న వ్యక్తి.. అతన్ని పక్కకు తోశాడు. దీంతో అసహనానికి గురైన ధర్మేంద్ర.. ఏకంగా తన స్నేహితుడి బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో లైటర్‌‌తో మంట వెలిగించాడు. దీంతో బైక్ తో పాటు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


ఇంధన పైపు, పెట్రోల్ మెషీన్‌కు( fuel station ) కూడా మంటలు అంటుకోవడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. పెట్రోల్ మెయిన్ సప్లైని ఆపేశాడు. ఆ తర్వాత వెంటనే ఫైర్ సేఫ్టీ కిట్‌తో మంటలను ఆర్పేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే పెట్రోల్ బంక్ పేలిపోయే ప్రమాదం ఉండేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన యువకుడికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిపై కేసు(police case) నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 20 , 2026 | 05:50 PM