Share News

రాజ్యసభకు ఖర్గే సహా 24 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నిక

ABN , Publish Date - Jun 12 , 2026 | 02:58 PM

రాజ్యసభకు ఈనెల 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా దీనికి ముందే పోటీ లేకుండా 24 మంది పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు.

రాజ్యసభకు ఖర్గే సహా 24 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నిక
Rajya Sabha

న్యూఢిల్లీ: రాజ్యసభకు ఈనెల 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా దీనికి ముందే పోటీ లేకుండా 24 మంది పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. మొత్తం 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 24 స్థానాలకు ఫలితాలు ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులకు విన్నింగ్ సర్టిఫికేట్లను రిటర్నింగ్ అధికారులు అందజేశారు.


రాజ్యసభలో ఎన్డీయే సంఖ్యాబలం 16 కాగా, తాజాగా మరో ముగ్గురు గెలవడంతో ఆ బలం 19కి చేరింది. కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోగా, నాలుగు సీట్లు ఇంతకు ముందే ఆ పార్టీకి ఉన్నాయి. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్‌‌కు ఒక సీటు మాత్రమే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 3 సీట్లు కోల్పోయింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ సైతం తన సీట్లు బీజేపీకి కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి దేబాశిష్ సమంతరాయ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమంతరాయ్ మే 26న బీజేడీ రాజ్యసభ పదవి వదిలి బీజేపీలో చేరారు. తిరిగి బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే నాలుగు సీట్లు గెలుచుకోగా, గుజరాత్‌లోని నాలుగు సీట్లను కూడా ఎన్డీయే ఎగరేసుకుపోయింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఒక సీటు దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 3 సీట్లు, రాజస్థాన్‌లోని 3 సీట్లలో రెండు సీట్లు బీజేపీ గెలుచుకుంది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లోని ఒక్కో స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. మేఘాలయలో ఎన్డీయే భాగస్వామి అయిన ఎన్‌పీపీ అక్కడి ఏకైక స్థానాన్ని గెలుచుకుంది. మహారాష్ట్ర, ఒడిశాలోనూ ఒక్కోసీటును ఎన్డీయే దక్కించుకోగా, తమిళనాడులోని ఏకైక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది.


ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీలు వీరే

ఆంధ్రప్రదేశ్:

భాష్యం రామకృష్ణ (టీడీపీ), చింతకాయల విజయ్ (టీడీపీ), సాన సతీష్ బాబు (టీడీపీ), లింగమనేని రమేష్ (జనసేన)

గుజరాత్:

రాజూబాయ్ శుక్లా, మాన్‌సిన్హ్ పర్మార్, ముఖేష్ భాయ్ రథ్వా, జితేంద్ర కంజారియా (ముగ్గురూ బీజేపీ).

కర్ణాటక:

మల్లికార్జున్ ఖర్గే, మన్సూర్ అలీఖాన్, పవన్ ఖేరా (ముగ్గురూ కాంగ్రెస్), ఎం.నాగరజ (బీజేపీ).

మధ్యప్రదేశ్:

తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ కేవట్ (ముగ్గురూ బీజేపీ).

రాజస్థాన్

సతీష్ పూనియా (బీజేపీ), ఆల్కా గుర్జర్ (బీజేపీ), నీ రజ్ డాంగి (కాంగ్రెస్)

అరుణాచల్ ప్రదేశ్:

తై తగాక్ (బీజేపీ)

మేఘాలయ:

జేమ్ కె సంగ్మా (ఎన్‌పీపీ)

మణిపూర్:

అధికారిమయూమ్ శారదా దేవి (బీజేపీ)

తమిళనాడు:

ప్రవీణ్ చక్రవర్తి (కాంగ్రెస్)

మహారాష్ట్ర:

రాజేంద్ర జైన్ (ఎన్‌సీపీ)

ఒడిశా:

దేబశీష్ సమంతరాయ్ (బీజేపీ)


ఇక జార్ఖాండ్, మిజోరంపైనే అందరి దృష్టి

కాగా, ఇప్పుడు అందరి దృష్టి జార్ఖాండ్, మిజోరం రాజ్యసభ ఎన్నికలపైనే ఉంది. జార్ఖాండ్‌లో రెండు రాజ్యసభ సీట్లు ఉండగా, ముగ్గురు పోటీలో ఉన్నారు. జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత బైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణవ్ ఝా, స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నాథ్వాని పోటీ చేస్తున్నారు. జార్ఖాండ్‌లో ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్కో సీటు గెలుపొందడానికి 28 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం కావాలి. ఎన్డీయేకు 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎల్‌కేఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్న నాథ్వాని గెలవాలంటే క్రాస్ ఓటింగ్ జరగాలి. మరోవైపు, మిజోరంలో ఒక రాజ్యసభ సీటు ఉండగా, జడ్‌పీఎం ప్రతినిధి కె.లామ్‌ట్‌లాంగ్ కిమా, ఎంఎన్ఎఫ్ నేత జోథాన్‌సంగి హ్మర్ ఎన్నికల బరిలో ఉన్నారు. 40 మంది సభ్యుల మిజోరం అసెంబ్లీలో జడ్‌పీఎంకు 27 మంది, ఎంఎన్ఎఫ్‌కు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం

పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ క్లారిటీ.. ప్రజలు ఓకే అంటేనే..

Updated Date - Jun 12 , 2026 | 03:06 PM