Share News

నలుగురి ప్రాణాలు తీసిన పులిని.. ఎట్టకేలకు బంధించిన అధికారులు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 10:46 AM

20 రోజులుగా వరుస దాడులతో ప్రజలను భయపెట్టిన పులిని ఎట్టకేలకు అధికారులు బంధించారు. నాలుగు ప్రాణాలను బలిగొన్న పులిని అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి, మత్తు ఇంజెక్షన్‌ చేసి బంధించారు. వివరాల్లోకి వెళితే..

నలుగురి ప్రాణాలు తీసిన పులిని.. ఎట్టకేలకు బంధించిన అధికారులు..
Maharashtra Tiger Attack

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత 20 రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. మనుషులు, పశువులను లక్ష్యంగా చేసుకున్న ఈ పులి వరుసగా దాడులు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం షిర్‌జ్‌గావ్‌ కస్బా ప్రాంతంలో ప్రత్యేక బృందం చాకచక్యంగా బంధించింది.

పులి కదలికలను పసిగట్టేందుకు అధికారులు కెమెరా ట్రాప్స్‌, థర్మల్‌ డ్రోన్లు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన అనంతరం ప్రత్యేక బృందాలు అక్కడ మాటువేసి.. సరైన సమయం కోసం వేచి చూశాయి. చివరకు పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి సురక్షితంగా పట్టుకున్నారు. దీంతో రోజుల తరబడి భయాందోళనలో ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ పులి గత 20 రోజులుగా అమరావతి, వర్ధా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులతో పాటు మనుషులపై దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సెప్టెంబరు 6న కేవలం 24 గంటల వ్యవధిలోనే పులి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. అప్పటి నుంచి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి.. పులిని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. పులి దాడిలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అనేక పశువులు కూడా పులి దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు అటవీశాఖ ఆర్థిక సాయం అందించింది.


ఇవి కూడా చదవండి

ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి

ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు

Updated Date - Sep 08 , 2026 | 11:54 AM