Share News

భారీ వరదలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు పైకి ఎక్కిన యువకుడు..

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:09 AM

మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో అంజనీ నదికి వరదనీరు పోటెత్తింది. నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయాడు.

భారీ వరదలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు పైకి ఎక్కిన యువకుడు..
Maharashtra Floods

ముంబై: మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు పాల్ఘర్, ముంబై, పుణె సహా పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జల్గావ్ జిల్లాలో కురిసిన వానలకు అంజనీ నదికి వరదనీరు పోటెత్తింది. నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అతడు పెద్ద చెట్టు పైకి ఎక్కాడు. బాధితుడిని సురేశ్ భిల్‌గా గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అతను చెట్టుపైనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


మరోవైపు, మహారాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ఇప్పటికే పాల్ఘర్, ముంబై, పుణె జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా.. నందుర్బార్, హింగోలి వంటి ప్రాంతాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షాలకు జులై మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులోనే 13 మంది మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. అలాగే, దాదాపు 100 ఇళ్లు దెబ్బతినగా.. వందలాది కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తాజాగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

ఇదే నా మొదటి, చివరి తప్పు.. క్షమించండి: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన బాలిక..

Updated Date - Aug 01 , 2026 | 12:39 PM