జాతీయస్థాయి కుంభకోణాలపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:54 AM
ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత ఆస్తుల వివాదాలలో అక్రమ నగదు బదిలీ చట్టాన్ని ప్రయోగించే బదులు(మనీలాండరింగ్ యాక్ట్) జాతీయస్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కుంభకోణాల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు మద్రాసు హైకోర్టు సూచించింది.
ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత వివాదాలపై కాదు
ఈ కేసుల్లో మనీలాండరింగ్ చట్టం వర్తించదు
విస్తృత అధికార పరిధి ఉందని చెలరేగిపోవద్దు
ఈడీకి మద్రాస్ హైకోర్టు హితవు
చెన్నై, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత ఆస్తుల వివాదాలలో అక్రమ నగదు బదిలీ చట్టాన్ని ప్రయోగించే బదులు(మనీలాండరింగ్ యాక్ట్) జాతీయస్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కుంభకోణాల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు మద్రాసు హైకోర్టు సూచించింది. ప్రైవేటు వ్యక్తుల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదాలకు సంబంధించిన అక్రమ నగదు బదిలీ కేసులో నిందితుడిగా ఉన్న అలగప్పన్ అనే వ్యక్తికి బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తిజస్టిస్ ఎన్. రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి తలెత్తే వివాదాలలో మనీ లాండరింగ్ చట్టాన్ని ప్రయోగించకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాలలో సాధారణ క్రిమినల్, సివిల్ చట్టాలకు సంబంధింని నిబంధనలను వర్తింపజేయాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను, జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చేసే తీవ్రమైన నేరాల ద్వారా వచ్చే సొమ్మును అక్రమంగా బదిలీ చేయకుండా నిరోధించడానికే మనీ లాండరింగ్ యాక్ట్‌ను రూపొందించారని న్యాయమూర్తి తెలిపారు. ఈ చట్టం దర్యాప్తు సంస్థలకు విస్తృత అధికార పరిధిని కల్పించిన మాట వాస్తవమే అయినప్పటికీ.. అలాగని ప్రతి విషయంలోనూ చెలరేగిపోవడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత కేసు.. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి మధ్య తలెత్తిన వివాదమని, దీనిలో ప్రభుత్వ సొమ్ముకానీ, ప్రజల సొమ్ముకానీ అధికారుల ప్రమేయం కానీ లేదని పేర్కొన్నారు. అయితే..
ఈ కేసు నుంచి ఈడీని తప్పుకోవాలని తాము ఆదేశించడం లేదన్నారు. విచారణను కొనసాగించాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఈడీకి ఉందని అన్నారు. కానీ, ఇలాంటి కేసులు కాకుండా.. విస్తృత ప్రజాప్రయోజనాలకు అవసరమైన కేసులపై దృష్టి పెట్టాలని మాత్రమే చెబుతున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక, బెయిల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ నిందితుడు అలగప్పన్‌కు నేరాల ద్వారా ఆస్తులు సంక్రమించాయని, లేదా అక్రమ నగదు బదిలీ ద్వారా లభించాయని చెప్పేందుకు ఈడీ తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అలగప్పన్ మనీలాండరింగ్‌కు పాల్పడలేదని, బెయిలు మంజూరు చేస్తే ఆయన మళ్లీ నేరం చేసే అవకాశం లేదనడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం, అలగప్పన్‌కు బెయిలు మంజూరు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.