Share News

తల్లి కులంతో పిల్లలు రిజర్వేషన్‌కు అర్హులే

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:40 AM

కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేటప్పుడు కేవలం తండ్రి పుట్టుక లేదా నివాస స్థలం ఆధారంగానే బిడ్డ స్థానికతను నిర్ణయించాలన్న పుదుచ్చేరి ప్రభుత్వ విధానాన్ని మద్రాస్‌ హైకోర్టు..

తల్లి కులంతో పిల్లలు రిజర్వేషన్‌కు అర్హులే

  • పుదుచ్చేరి పితృస్వామ్య వైఖరిని తోసిపుచ్చిన మద్రాస్‌ హైకోర్టు

  • పిటిషనర్లకు కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని ఆదేశం

చెన్నై, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేటప్పుడు కేవలం తండ్రి పుట్టుక లేదా నివాస స్థలం ఆధారంగానే బిడ్డ స్థానికతను నిర్ణయించాలన్న పుదుచ్చేరి ప్రభుత్వ విధానాన్ని మద్రాస్‌ హైకోర్టు తప్పుబట్టింది. బిడ్డ ఎదుర్కొనే సామాజిక వెనుకబాటుతనం, వివక్ష ఆధారంగా రిజర్వేషన్‌ కల్పిస్తారని, అది తండ్రి వైపు నుంచా లేక తల్లి వైపు నుంచా అనేది ప్రయోజనాలను కల్పించడంలో ఎలాంటి వ్యత్యాసం చూపదని స్పష్టం చేసింది. తమ తండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారనే ఏకైక కారణంతో పుదుచ్చేరి అధికారులు తమకు కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తున్నారని, లేకుంటే మైగ్రెంట్‌ కేటగిరీ కింద జారీ చేస్తున్నారని పేర్కొంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులన్నింటిలోనూ తల్లులు పుదుచ్చేరిలో స్థానికులే. వారంతా ఎస్సీ, ఎంబీసీ, ఓబీసీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నవారే. అయితే, మనది పితృస్వామ్య సమాజం కాబట్టి కులాన్ని తండ్రి వైపు నుంచే గుర్తించాలని, చట్టపరమైన నిబంధన లేకుండా తల్లి వైపు నుంచి గుర్తించలేమన్న పుదుచ్చేరి ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ల తల్లి స్వస్థల వివరాల ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి దళితుడి పేరుతో కులవివక్ష వ్యతిరేక చట్టం కింద రక్షణ కోరలేరని మద్రాస్‌ హైకోర్టు ఓ కేసులో స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:40 AM