కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పుబట్టిన మద్రాస్ హైకోర్టు
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:48 PM
సీఎం విజయ్ సర్కారుకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
చెన్నై, జులై 27: సీఎం విజయ్ సర్కారుకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారని, రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని హైకోర్టు పేర్కొంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2025 సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి తమిళనాడులోని కరూర్ జిల్లా, వేలుచామిపురం (కరూర్-ఈరోడ్ రోడ్డు) వద్ద జరిగిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఎనిమిది మందికి పైగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ జులై 10వ తేదీన తొలిసారి కరూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బాధితుల కుటుంబాలను కలుసుకుని నియామక పత్రాలను అందజేశారు.
టీవీకే ప్రభుత్వం కరూర్ తొక్కిసలాట బాధితులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌తో పాటు కొందరు సామాజిక కార్యకర్తలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై సోమవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్థిక సాయం లేదా పరిహారం అందించవచ్చని.. నిబంధనలు దాటి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే.. బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్