Share News

ప్రేమలేఖ రాసి.. కాంగ్రెస్ ఆఫీసులో 70కి పైగా వాష్‌రూమ్ నల్లాలు ఎత్తుకెళ్లిన వింత దొంగలు!

ABN , Publish Date - May 17 , 2026 | 04:48 PM

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఒక వింత దొంగతనం జరిగింది. ఆ దొంగలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం 'రాజీవ్ భవన్'తో వింత అనుబంధం ఏర్పడినట్లుంది. ఎందుకంటే, ఆ కార్యాలయంలో వరుసగా మూడోసారి చొరబడిన దొంగలు.. వాష్‌రూమ్‌లలో దోపిడీ అనంతరం'ఐ లవ్ యూ అంబికాపూర్' అని రాసి మరీ పరారయ్యారు.

ప్రేమలేఖ రాసి.. కాంగ్రెస్ ఆఫీసులో 70కి పైగా వాష్‌రూమ్ నల్లాలు ఎత్తుకెళ్లిన వింత దొంగలు!
‘I Love You Ambikapur’: Thieves Steal 70+ Taps from Congress Office in Chhattisgarh

రాయ్‌పూర్, మే 17: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నగరంలో ఒక వింత దొంగతనం వెలుగుచూసింది. దొంగలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం 'రాజీవ్ భవన్' పై వింత అనుబంధం ఏర్పడినట్లుంది. ఎందుకంటే, ఆ కార్యాలయంలో వరుసగా మూడోసారి చొరబడిన దొంగలు.. వాష్‌రూమ్‌లలో ఉన్న దాదాపు 73 స్టీల్ నల్లాలు (Taps), ఇతర ప్లంబింగ్ ఫిట్టింగులను ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా, వెళ్తూ వెళ్తూ అక్కడి నేలపై పేరుకుపోయిన దుమ్ములో చేత్తో 'ఐ లవ్ యూ అంబికాపూర్' (I Love You Ambikapur) అని రాసి మరీ పరారయ్యారు.

నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే, వీఐపీ జోన్‌గా భావించే గాంధీ చౌక్ ప్రాంతంలోని కాంగ్రెస్ ఆఫీసులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం ఆఫీసు తెరిచిన సిబ్బంది వాష్‌రూమ్‌ల పరిస్థితి చూసి షాక్‌కు గురయ్యారు. బేసిన్లు పగిలిపోయి, ఫ్లష్ సిస్టమ్స్ ధ్వంసమై, గోడలకు ఉండాల్సిన నల్లాలు మాయమై పైపులు మాత్రమే వేలాడుతూ కనిపించాయి.

పోలీసులకు బహిరంగ సవాల్:

ఈ వింత చోరీపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ భవన్‌లో ఇలాంటి దొంగతనం జరగడం ఇది మూడోసారి అని ఆయన పేర్కొన్నారు. 'దొంగలు ఎంత ధీమాగా వచ్చారంటే.. తాము పట్టుబడతామనే భయం కొంచెకూడా లేకుండా ఎంతో నిదానంగా, నైపుణ్యంతో ఆ ఖరీదైన నల్లాలను ఊడదీశారు. వాళ్లకు కావాల్సినంత సమయం దొరికినట్లుంది' అని ఒక కాంగ్రెస్ నాయకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


గతంలో జరిగిన రెండు దొంగతనాలపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని, అందుకే దొంగలు ఇంతగా రెచ్చిపోతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. నేలపై 'లవ్ యూ' అని రాసి వెళ్లడం.. స్థానిక పోలీసు యంత్రాంగాన్ని, శాంతిభద్రతల పరిస్థితిని బహిరంగంగా ఎగతాళి చేయడమేనని పాఠక్ విమర్శించారు. నగరంలో తిరుగుతున్న డ్రగ్స్ వ్యసనపరులు లేదా అసాంఘిక శక్తులు ఈ పనికి ఒడిగట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.

రాజకీయ నినాదాలతో హోరెత్తే పార్టీ కార్యాలయం.. ఈసారి నల్లాలు మాయమై, నేలపై ఊహించని 'ప్రేమ సందేశం'తో దర్శనమివ్వడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ వింత దొంగల ముఠా వెనుక ఉన్నది స్క్రాప్ (పాత ఇనుము) కోసం ఆశపడే దొంగలా, లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

For More AP News And Telugu News

Updated Date - May 17 , 2026 | 04:55 PM