Share News

48 గంటల్లో 129 సెం.మీ. వాన

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:47 AM

మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో రికార్డు స్థాయిలో 48 గంటల్లో 129 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుణె జిల్లాలోని ప్రముఖ కొండ ప్రాంతం లోనావాలాలో ఈనెల 5న 67 సెంటీమీటర్లు...

48 గంటల్లో 129 సెం.మీ. వాన

  • లోనావాలాలో రికార్డు వర్షపాతం

  • వెయ్యేళ్లకోసారి ఇలా జరుగుతుందంటున్న నిపుణులు

న్యూఢిల్లీ, జూలై 8: మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో రికార్డు స్థాయిలో 48 గంటల్లో 129 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుణె జిల్లాలోని ప్రముఖ కొండ ప్రాంతం లోనావాలాలో ఈనెల 5న 67 సెంటీమీటర్లు, 6న 62 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెయ్యేళ్లలో ఒకసారి ఇలాంటి అరుదైన వాతావరణ ఘటనలు జరుగుతుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహ్యాద్రి పర్వతశ్రేణిలో నిటారుగా ఉన్న పశ్చిమభాగాన్ని తాకిన అసాధారణ, బలమైన నైరుతి రుతుపవన గాలుల కారణంగా.. అత్యధికంగా కేంద్రీకృతమైన వాతావరణ శక్తుల సంపూర్ణ కలయిక వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలిని వేగవంతంగా పైకిలేచేలా చేసి.. ఎడతెరపి లేకుండా ఇంత భారీస్థాయిలో వర్షం కురవడానికి కారణమైందన్నారు. సంవత్సర కాలంలో లండన్‌లో కురిసే సగటు వర్షపాతం కంటే ఎక్కువగా లోనావాలలో 24 గంటల వ్యవధిలోనే కురిసిందని ఐఎండీ పేర్కొంది. 70 ఏళ్ల క్రితం 1953 ఆగస్టులో ఇదే ప్రాంతంలో 88.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 09 , 2026 | 05:47 AM