Share News

తృణమూల్ నేత కుణాల్ ఘోష్ కారుపై కోడిగుడ్లతో దాడి

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:26 PM

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా శీరాంపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనంపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

తృణమూల్ నేత కుణాల్ ఘోష్ కారుపై కోడిగుడ్లతో దాడి
Kunal Ghosh Car Attacked in Hooghly, Eggs Hurled During Rally

కోల్‌కతా, సెప్టెంబర్ 26: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా శీరాంపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. శీరాంపూర్‌లో మమతా బెనర్జీ నిర్వహించాల్సిన బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


కుణాల్ ఘోష్ వాహనాన్ని చుట్టుముట్టిన గుంపు 'కుణాల్ ఘోష్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులు కోడిగుడ్లు, రాళ్లు రువ్వడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది.ఈ ఆకస్మిక దాడి, భద్రతా లోపం కారణంగా ఘోష్ తన శీరాంపూర్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి కోల్‌కతాకు పయనమయ్యారు.


రాష్ట్రంలో 'జంగల్ రాజ్' నడుస్తోందని ఘోష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లాల్ బజార్ లేదా భవానీ భవన్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.


ఈ దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) పై విమర్శలు గుప్పించారు. 'బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు సృష్టించవద్దు' అని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనలో కుణాల్ ఘోష్‌కు గాయాలయ్యాయని, దాడి జరిగిన స్థలానికి తాను స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తానని చెప్పారు. TMC నాయకులు, కార్యకర్తలను బీజేపీ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు.

Updated Date - Sep 26 , 2026 | 05:06 PM