కొండలు దాటి.. నిర్బంధాలను ఛేదించి!
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:43 AM
ఒడిశా ప్రభుత్వ ఆంక్షల్ని.. పోలీసు నిర్బంధాన్ని లెక్కచేయకుండా.. కొండలు, వాగులు దాటి వచ్చి కొఠియా గ్రామాల గిరిజనులు గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కొఠియా గిరిజనులు
ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం
పార్వతీపురం, సాలూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఒడిశా ప్రభుత్వ ఆంక్షల్ని.. పోలీసు నిర్బంధాన్ని లెక్కచేయకుండా.. కొండలు, వాగులు దాటి వచ్చి కొఠియా గ్రామాల గిరిజనులు గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా పోలీసుల నిర్బంధంతో తొలుత నేరెళ్లవలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఏపీ అధికారులు సాలూరు మండలం సారిక గ్రామానికి మార్చారు. మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి చొరవతో ఓటర్లు సారిక చేరుకుని ఓటు వేశారు.
ఈ పోలింగ్ కేంద్రంలో నేరెళ్లవలసకు చెందిన 348 మంది, పగులు, చెన్నూరు గ్రామాలకు చెందిన 2016 మంది, పట్టుచీనూరుకు చెందిన 539 మంది ఓటు వేయాలి. సాయంత్రానికి 63.48 శాతం పోలింగ్ నమోదైంది. సారికలోని పోలింగ్ కేంద్రాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘29 కొఠియా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ఒడిశా అధికారులు హింసాత్మక చర్యలకు పాల్పడడం సరికాదు. ఐదుగురు గిరిజనులను ఒడిశా అధికారులు కిడ్నాప్ చేయడం దారుణం.వారిలో ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్నారు’ అని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ