Share News

పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్‌ వల్లూరి ప్రమాణం

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:02 AM

పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ వల్లూరి కామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం బిహార్‌ లోక్‌ భవన్‌లో గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం సమ్రాట్‌ చౌదరి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్‌ కామేశ్వరరావు కుటుంబం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో నివసించేది.

పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్‌ వల్లూరి ప్రమాణం

పట్నా, సెప్టెంబరు 13: పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ వల్లూరి కామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం బిహార్‌ లోక్‌ భవన్‌లో గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం సమ్రాట్‌ చౌదరి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్‌ కామేశ్వరరావు కుటుంబం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో నివసించేది. ఆయన తండ్రి వాసుదేవ మూర్తి ఉద్యోగ రీత్యా 1954లో ఢిల్లీలో స్థిరపడ్డారు. 1965 ఆగస్టు 7న అమలాపురంలో జన్మించిన జస్టిస్‌ కామేశ్వరరావు తన విద్యాభ్యాసాన్ని ఢిల్లీలోనే పూర్తిచేశారు. 1987లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో ఆనర్స్‌తో పాటు 1990లో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. 1991 మార్చిలో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ప్రధాన బెంచ్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీసు కొనసాగించారు. 2010లో ఢిల్లీ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 2013 ఆగస్టు 17న అక్కడే అదనపు న్యాయమూర్తిగా, 2015 మార్చి 18న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2024 జూన్‌లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2025 మే 29 నుంచి అదే ఏడాది జూలైలో ఢిల్లీ హైకోర్టుకు తిరిగి వచ్చేవరకూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 04:02 AM