వాష్‌రూమ్‌లో నర్స్ మృతదేహం
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:49 PM
కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌లో కలకలం రేగింది. గైనకాలజీ విభాగం వాష్‌రూమ్‌లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వాష్‌రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకున్నారు.
కోల్‌కతా, ఆగస్టు 13: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రముఖ నీల్‌రతన్ సర్కార్ (NRS) మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో కలకలం రేగింది. ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం వాష్‌రూమ్‌లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వాష్‌రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని రూపాలి బర్మన్‌గా గుర్తించారు.
అసలేం జరిగింది?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం రూపాలి బర్మన్ బుధవారం రాత్రి 8 గంటల షిఫ్ట్ డ్యూటీకి హాజరయ్యారు. గైనకాలజీ విభాగానికి చెందిన 'హై డిపెండెన్సీ యూనిట్' నర్సింగ్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఒక రోగికి సేవలు అందించిన అనంతరం HDU రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లారు. రాత్రి 10:20 గంటలకు ఆమె రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లగా, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది 10:27 గంటల సమయంలో బయట నుంచి పిలిచారు. లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన చెందిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి, తలుపులు బద్దలుగొట్టి చూడగా.. రూపాలి నేలపై స్పృహతప్పి పడి ఉంది. వెంటనే ఆమెను ట్రాలీపై అత్యవసర వైద్యం కోసం తరలించినప్పటికీ, వైద్యులు పరిశీలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
విచారణ వేగవంతం చేసిన హోమిసైడ్ వింగ్
ఈ ఘటనపై కోల్‌కతా పోలీస్ జాయింట్ సీపీ (క్రైమ్) కునాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నాం. కలకత్తా పోలీస్ 'డిడి హోమిసైడ్ డిపార్ట్‌మెంట్' ఇప్పటికే విచారణను వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఇది ఆత్మహత్య అని ఆధారాలేవీ లభించలేదు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తోంది. వాష్‌రూమ్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నాం' అని తెలిపారు.
ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఆసుపత్రిలో నర్స్ మృతి చెందడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఒక విచారణ కమిటీని ఆదేశించింది. నర్స్ మృతికి గల అసలు కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు: డోలా వీరాంజనేయస్వామి
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త భద్రతా నిబంధనలు