సభను సజావుగా సాగనివ్వండి
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:26 AM
అన్ని నిబంధనలకూ అనుగుణంగానే సోమవారం నుంచి నాలుగు రోజులపాటు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగానే సమావేశాలు
బిల్లులపై అర్థవంతమైన చర్చలు జరపండి
ఎంపీలకు కేంద్ర మంత్రి రిజిజు పిలుపు
న్యూఢిల్లీ, నవంబరు 28: అన్ని నిబంధనలకూ అనుగుణంగానే సోమవారం నుంచి నాలుగు రోజులపాటు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ఎంపీలందరూ ఉభయసభలూ సజావుగా జరగడానికి సహకరించాలని అభ్యర్థించారు. కీలకమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుందని.. వాటిపై అర్థవంతమైన చర్చలు జరపాలని కోరారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన పార్టీల నేతలతో తాను మాట్లాడానన్నారు. ‘సభ్యులకు అన్ని హక్కులూ ఉన్నాయి. ప్రభుత్వంతో ఏకీభవించవచ్చు.. విభేదించే స్వేచ్ఛ కూడా వారికి ఉంది. కానీ సభలు మాత్రం సజావుగా జరగాలి’ అని విజ్ఞప్తిచేశారు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా.. వాటిని ఇప్పుడు కొనసాగించడం ద్వారా ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ‘సమావేశాల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది? సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా తిరిగి వాటిని కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. సమావేశాలు ఏర్పాటుచేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌కు నేను లేఖలు రాశాను. లోక్‌సభలో సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం చేపడుతుంది. వాటిని 2, 3 తేదీల్లో రాజ్యసభకు తీసుకొస్తాం. అవేంటనేది మీకు తర్వాత చెబుతా’ అని చెప్పారు. కీలకమైన బిల్లులు, అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే.. లోక్‌సభ ప్రస్తుత బలం 543 నుంచి 850కి చేరుతుంది.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి