మహాత్మా గాంధీ ఆలపించిన గేయాన్నే నేనూ పాడాను: ఖర్గే
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:42 PM
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వందేమాతర గేయం ఆలాపనపై వివాదం అంతకంతకూ ముదురుతోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం తమ తీరును సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వందేమాతర గేయం ఆలాపనపై వివాదం అంతకంతకూ ముదురుతోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం తమ తీరును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాడిన గేయాన్నే తాను ఆలపించానని మంగళవారం ఖర్గే స్పష్టం చేశారు.
అప్పటి పాటను పాడటం నేరమే అయితే కేంద్రం ఆ దివంగత నేతలపై కూడా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘గాంధీ, నెహ్రూ, పటేల్ జన్మించకముందే భారత్ జాతీయ గేయాలు ఏవో నిర్ణయిస్తూ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. మీరు చెప్పినదల్లా జాతీయ ప్రమాణికం అయిపోదు. ఇలాగైతే రేపు మరో ప్రభుత్వం అధికారంలో వచ్చి చెప్పేది కూడా రూల్ అయిపోవచ్చు. 90 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీనే మేమూ కొనసాగిస్తున్నాము’ అని ఖర్గే అన్నారు.
ఇక దక్షిణ గోవాలో తాజాగా జరిగిన ఓ ర్యాలీలో కూడా ఖర్గే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై మండిపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటో చెప్పాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ఆలాపన సందర్భంగా ఖర్గే, సోనియా గాంధీ మాట్లాడుతున్నట్టు ఉన్న వీడియో వైరల్ కావడంతో కాంట్రవర్సీ మొదలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు వందేమాతర గేయాన్ని అవమానించారని బీజేపీ మండిపడింది. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం
భారత్ ఎన్నికల విధానంపై ట్రంప్ ప్రశంసలు.. అమెరికాలోనూ తప్పనిసరి ఓటర్ ఐడీకి పట్టు..