వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఐదుగురు కార్మికుల మృతి..
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:25 PM
కేరళంలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు.
కేరళం: భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా, మట్టి కింద కూరుకుపోయిన ఆరుగురిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంపై కేరళం ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ స్పందించారు. వెంటనే జిల్లా మంత్రులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక, పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశించారు. వయనాడ్‌కు వెళ్లి సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు అనిల్ కుమార్, సిద్ధిక్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు అగ్నిమాపక, పోలీసు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు.
వయనాడ్‌లో సోమవారం నుంచి భారీ వర్షాలు పడుతుండగా సొరంగం పనులను అదే రోజు నుంచి ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే సుమారు 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం పని చేసే కార్మికులు నివసించే వసతి గృహంపై కొండచరియలు పడ్డాయి. అలాగే, కొన్ని నివాస గృహాలు, హోమ్‌స్టేలపైనా భారీగా మట్టి, రాళ్లు వచ్చిపడ్డాయి. దీంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. మరోవైపు శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు, స్థానికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు భావిస్తున్నారు. అనేక వాహనాలు, ఇళ్లు దెబ్బతినగా.. నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయలేదు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సింగూర్ ఔట్.. ముఖర్జీ ఇన్.. బెంగాల్ పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పు.. సీఎం సూచన..
సియా గోయల్, చేతన్ చౌదరికి నాలుగు నెలల కిందటే వివాహం..!