Share News

భార్యకు ఉరేసి.. ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్..

ABN , Publish Date - Jul 28 , 2026 | 02:59 PM

కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆమెకు ఉరి వేశాడు.

భార్యకు ఉరేసి.. ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్..
Karnataka Man Wife

ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆమెకు ఉరి వేశాడు. భార్య తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి.. ఉరికి వేలాడుతూ ప్రాణం కోసం పోరాడుతున్న ఆమెను లైవ్‌లో వారికి చూపించాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బాగల్‌కోట్ జిల్లా, గలగాలి గ్రామానికి చెందిన ప్రవీణ్ జిగలూర్, భాగ్యశ్రీ జిగలూర్ భార్యాభర్తలు. భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ప్రవీణ్ అనుమానం పెంచుకున్నాడు.


గత కొన్ని నెలలనుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా భాగ్యశ్రీ భర్తతో ఉండలేకపోయింది. రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రవీణ్ భార్యకు తరచుగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని బతిమలాడటం మొదలెట్టాడు. భర్త అంతగా బతిమలాడుతుంటే ఆమె కాదన లేకపోయింది. ఆదివారం పుట్టింటినుంచి భర్త దగ్గరకు వచ్చింది. భాగ్యశ్రీ ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది.


ప్రవీణ్ భార్యను కర్రతో చితకబాదాడు. తర్వాత ఆమెకు దుపట్టాతో ఉరి వేశాడు. భాగ్యశ్రీ తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి.. ఉరికి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న ఆమెను లైవ్‌లో చూపించాడు. భాగ్యశ్రీ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రవీణ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయింది. పోలీసులు భాగ్యశ్రీ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం: సునీల్ గావస్కర్

కుంకుమపువ్వు అసలైనదో కాదో ఇలా తెలుసుకోండి.!

Updated Date - Jul 28 , 2026 | 03:01 PM