కుంకుమపువ్వు అసలైనదో కాదో ఇలా తెలుసుకోండి.!
ABN , Publish Date - Jul 28 , 2026 | 02:18 PM
మార్కెట్లో నకిలీ కుంకుమపువ్వు విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిలో రంగు మారే తీరు, రేకుల ఆకారం, వాసన, రుచి వంటి కొన్ని సులభమైన పరీక్షలతో కుంకుమపువ్వు అసలైనదో, కాదో సులభంగా గుర్తించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుల్లో ఒకటి. దీనిని వంటల్లో, ఆయుర్వేద ఔషధాల్లో, సౌందర్య సాధనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నందున చాలామంది దీనిని వినియోగిస్తుంటారు. అయితే అధిక ధర కారణంగా మార్కెట్లో నకిలీ కుంకుమపువ్వు కూడా ఎక్కువగా అమ్ముడవుతోంది. నకిలీ కుంకుమపువ్వు ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందుకే కుంకుమపువ్వు వాడే ముందు ఇలా పరిశీలించి చూడటం మంచిది.
నీటిలో లేదా పాలలో వేసి చూడాలి
అసలైన కుంకుమపువ్వును నీటిలో లేదా పాలలో వేసినప్పుడు వెంటనే రంగు వదలదు. కొంత సమయం తర్వాత మెల్లగా లేత పసుపు లేదా బంగారు రంగు వస్తుంది. నకిలీ కుంకుమపువ్వు మాత్రం వెంటనే ముదురు ఎరుపు లేదా నారింజ రంగును విడుదల చేస్తుంది.
రేకుల ఆకారాన్ని గమనించాలి
అసలైన కుంకుమపువ్వు రేకులు పలుచగా ఉండి, పై భాగంలో కొద్దిగా వెడల్పుగా, బూర ఆకారంలో కనిపిస్తాయి. నకిలీ కుంకుమపువ్వు రేకులు ఒకేలా, నిటారుగా ఉంటాయి.
వాసన చూసి గుర్తించాలి
నిజమైన కుంకుమపువ్వుకు తేలికపాటి తియ్యటి, సహజమైన సువాసన ఉంటుంది. నకిలీ కుంకుమపువ్వుకు మాత్రం ఘాటైన లేదా కృత్రిమ సువాసన వస్తుంది.
రుచి ద్వారా పరీక్షించాలి
ఒక రేకును నాలుకపై ఉంచి చూడండి. అసలైన కుంకుమపువ్వు రుచి స్వల్పంగా చేదుగా, వగరుగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత శరీరంలో వెచ్చదనం అనిపించవచ్చు. తీపిగా లేదా పుల్లగా అనిపిస్తే అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే నకిలీ కుంకుమపువ్వు నాలుకపై ఉంచిన వెంటనే రంగు వదలడం ప్రారంభిస్తుంది.
చేతితో రుద్ది చూడాలి
ఒక కుంకుమపువ్వు రేకును చేతితో మెల్లగా రుద్ది చూడాలి. అసలైనది చాలా సున్నితంగా ఉండి సులభంగా విరిగిపోతుంది. నకిలీ కుంకుమపువ్వు మాత్రం అంత తేలికగా విరగదు.
బేకింగ్ సోడాతో పరీక్షించాలి
ఒక గ్లాసు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి, అందులో కొన్ని కుంకుమపువ్వు రేకులు వేయండి. అసలైన కుంకుమపువ్వు అయితే నీరు పసుపు రంగులోకి మారుతుంది. నకిలీదైతే ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు