Share News

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సిద్దరామయ్య

ABN , Publish Date - May 28 , 2026 | 11:21 AM

గురువారం ఉదయం మంత్రులకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు.

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సిద్దరామయ్య
Siddaramaiah

ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం మంత్రులకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని సహచర మంత్రులకు సిద్దరామయ్య చెప్పారు. కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేబినెట్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.


అల్పాహార విందు సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాళ్లు మెక్కారు. తర్వాత ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాగా, సిద్దరామయ్య రాజీనామా లేఖను సమర్పించటం కోసం ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ రోజు ఉదయం ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించడానికి సిద్ధమయ్యారు. అయితే, గవర్నర్ అందుబాటులో లేరు. నిన్న రాత్రి 10:30 గంటలకు ఆయన ముంబై వెళ్లారు. మధ్యాహ్నం బెంగళూరుకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దరామయ్య గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు.


సిద్దరామయ్యకు రాజ్యసభ?

సిద్దరామయ్యను రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆయనకు పలు ఆఫర్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యసభ టికెట్‌ ఇస్తామని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. తాను జాతీయ రాజకీయాల్లోకి రాలేనని, హిందీ సమస్య కానుందని రాహుల్‌తో సిద్దరామయ్య అన్నారట. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.


ఇవి కూడా చదవండి

వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

Updated Date - May 28 , 2026 | 12:00 PM