పాఠశాలల్లో హిజాబ్‌పై ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక ప్రభుత్వం
ABN , Publish Date - May 13 , 2026 | 09:01 PM
పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 2022 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ నేడు(బుధవారం) నూతన ఉత్తర్వులను జారీ చేసింది.
బెంగళూరు: పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 2022 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ నేడు(బుధవారం) నూతన ఉత్తర్వులను జారీ చేసింది. అనంతరం విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూ రావు విలేకరుల సమావేశం నిర్వహించి కొత్త ఉత్తర్వును ప్రకటించారు. గతంలో 12వ తరగతి వరకూ విధించిన హిజాబ్ నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
కర్ణాటక విద్యా చట్టం 1983 సెక్షన్లు 7, 133(2), కర్ణాటక విద్యా సంస్థల నియమావళి 1995లోని 11 నిబంధన ప్రకారం ఈ కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రులు పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు పరిమితంగా మతపరమైన సంప్రదాయ, ఆచార చిహ్నాలను ధరించేందుకు అనుమతించినట్లు తెలిపారు. హిజాబ్, స్కార్ఫ్, తలపాగాలు, జనివార/పవిత్ర దారం, శివ దారం, రుద్రాక్షలు వంటివి ధరించవచ్చని వెల్లడించారు. అయితే, ఇవన్నీ పాఠశాల యూనిఫాంలకు అనుగుణంగా మాత్రమే ఉండాలన్నారు. వీటిని ధరించి వచ్చే విద్యార్థులను పాఠశాల యాజమాన్యాలు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఏ విద్యార్థిని కూడా మతపరమైన సంప్రదాయ చిహ్నాలను ధరించాలని బలవంతం చేయకూడదని మంత్రులు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం అనుమతించిన వాటిని తొలగించమనీ ఒత్తిడి చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో ఉన్నట్లు మంత్రులు వెల్లడించారు. విద్యాసంస్థల్లో క్రమశిక్షణను పాటిస్తూనే మత, సాంస్కృతిక పరమైన ఆచారాలను గౌరవించడం ఈ ఉత్తర్వుల ఉద్దేశమని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్